ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అరెస్టు!

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అరెస్టు!

అవును.. నిజ‌మే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అరెస్ట‌య్యాడు. ఇంత‌కీ అరెస్టుకు కార‌ణం ఏంటో తెలుసా? తెలుగు ప్రేక్ష‌కుల‌ను మ‌రీ ఎక్కువ న‌వ్వించేయ‌డ‌మే. ఈ నేరం కింద యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ అత‌డిని అరెస్టు చేశాడు. అనిల్ చేతుల‌కు బేడీలు వేసిన ఫొటోను కూడా అత‌ను ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు. అనిల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్‌, విక్ట‌రీ వెంకటేష్ హీరోలుగా న‌టించిన *ఎఫ్‌-2* సంక్రాంతికి రిలీజై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. మొద‌టి నుంచి ఎంట‌ర్టైన‌ర్లకు పెట్టింది పేరుగా నిలుస్తున్న అనిల్.. ఈ సినిమాతో వినోదాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించాడు. సంక్రాంతి సీజ‌న్లో కుటుంబ ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలాంటి సినిమానే అనిల్ అందించ‌డంతో దీనికి వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. ఇప్ప‌టిదాకా ఈ చిత్రం రూ.75 కోట్ల దాకా షేర్ క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఇంకో ప‌ది కోట్ల దాకా షేర్ వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు.

ఈ విజ‌యంతో *ఎఫ్‌-2* టీం అంతా పిచ్చ హ్యాపీగా ఉంది. ఈ ఆనందంలోనే వ‌రుణ్ ఒక స‌ర‌దా ఫొటోను ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు. ఈ సినిమా ఆరంభ సన్నివేశాల్లో వెంకీ-వ‌రుణ్ ఫారిన్లో పోలీసులుగా క‌నిపిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ సీన్ భ‌లేగా న‌వ్విస్తుంది. ఆ స‌న్నివేశం తీస్తున్న సంద‌ర్భంలోనే అనిల్ చేతుల‌కు బేడీ వేసి తీసుకెళ్తున్న‌ట్లుగా వ‌రుణ్ ఒక ఫొటో తీయించుకున్నాడు. దాన్ని ఇప్పుడు ట్విట్ట‌ర్లో షేర్ చేసి ఫ‌న్నీ కామెంట్ జోడించాడు. ఈ ఫొటో చూసి నెటిజ‌న్లు స‌ర‌దాగా స్పందిస్తున్నారు. ఎఫ్‌-2లో ఫేమ‌స్ అయిన *అంతేగా.. అంతేగా* డైలాగునే చాలామంది కామెంట్‌గా పెట్టారు. *ఎఫ్‌-2* తిరుగులేని స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీయాల‌ని అనిల్ ఫిక్స‌య్యాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించాడు. ఎఫ్‌-3 టైటిల్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం 2021 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌ట‌. అందులోనూ వెంకీ, వ‌రుణ్‌లే హీరోలుగా న‌టించే అవ‌కాశ‌ముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English