సంప‌త్ నందిని వ‌దిలి పెట్టేయ‌లేదు

సంప‌త్ నందిని వ‌దిలి పెట్టేయ‌లేదు

టాలీవుడ్లో సంప‌త్ నంది కెరీర్ మలుపులు తిరిగిన‌ట్లుగా మ‌రే ద‌ర్శ‌కుడి కెరీర్ ట‌ర్న్ అయి ఉండ‌దేమో. *ఏమైంది ఈవేళ‌* లాంటి చిన్న సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయిన అత‌ను.. రెండో సినిమానే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ఛాన్స్ అందుకోవ‌డ‌మే కాదు.. *ర‌చ్చ‌*తో మాంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టి ఔరా అనిపించాడు. దీని త‌ర్వాత *గ‌బ్బ‌ర్ సింగ్* సీక్వెల్‌తో సంప‌త్ కెరీర్ మ‌రో స్థాయికి చేరేలా క‌నిపించింది కానీ.. ఆ సినిమా మీద రెండేళ్లు వ‌ర్క్ చేశాక త‌ప్పుకోవాల్సి రావ‌డం సంప‌త్‌కు తీర‌ని బాధ క‌లిగించేదే. అయిన‌ప్ప‌టికీ ఆ బాధ‌లో మునిగిపోకుండా *బెంగాల్ టైగ‌ర్*.. *గౌత‌మ్ నంద‌* లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేసే అవ‌కాశం అందుకున్నాడు. కానీ ఈ రెండు సినిమాలూ నిరాశ‌నే మిగల్చ‌డంతో సంప‌త్ కెరీర్ డౌన్ అయింది. ఏడాదిన్న‌ర‌గా సినిమా లేక ఖాళీగా ఉన్నాడ‌త‌ను. అత‌ను *గౌత‌మ్ నంద‌* హీరో గోపీచంద్‌తోనే మ‌రో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ.. అది కార్య‌రూపం దాల్చ‌లేదు.

సంప‌త్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూనే.. త‌మిళ ద‌ర్శ‌కుడు తిరుతో సినిమా ఓకే చేసి దాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయాడు గోపీ. ఈ సినిమా అయ్యాక త‌న‌తో ప‌ని చేసేలా గోపీ నుంచి శ్రీవాస్ క‌మిట్మెంట్ తీసుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో ఇంత‌క‌ముందు వ‌చ్చిన *ల‌క్ష్యం*.. *లౌక్యం* సూప‌ర్ హిట్ల‌యిన నేప‌థ్యంలో అత‌డిని కాద‌ని.. *గౌత‌మ్ నంద‌* లాంటి ఫ్లాప్ ఇచ్చిన సంప‌త్‌తో గోపీ జ‌త‌క‌డ‌తాడా అన్న సందేహాలు నెల‌కొన్నాయి. ఐతే తాజా స‌మాచారం ప్ర‌కారం గోపీ.. సంప‌త్‌తోనే సినిమా ఓకే చేశాడ‌ట‌. ఈ చిత్రం ఈ వేస‌వి నుంచే సెట్స్ మీదికి వెళ్తుంద‌ట‌. ఈ లోపు తిరు సినిమాను ఓ కొలిక్కి తెచ్చి సంపత్ చిత్రాన్ని మొద‌లుపెడ‌తాడ‌ట గోపీ. *బెంగాల్ టైగ‌ర్* నిర్మాత రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక స‌మాచారం వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఈ అవ‌కాశాన్న‌యినా సంప‌త్ స‌రిగ్గా ఉప‌యోగించుకుని హిట్ ఇస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English