96 రీమేక్ వ‌ద్ద‌న్న స‌మంతే..

96 రీమేక్ వ‌ద్ద‌న్న స‌మంతే..

ఒక భాష‌లో క్లాసిక్ అనిపించుకున్న సినిమాను మ‌రో భాష‌లో రీమేక్ చేయాలంటే చాలా భ‌య‌ప‌డిపోతున్నారు ఈ రోజుల్లో. అలాంటి సినిమా రీమేక్ అన‌గానే సోష‌ల్ మీడియాలో జ‌నాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఆయా పాత్ర‌ల్లో వేరే ఆర్టిస్టుల్ని చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ట్లేదు. ఒరిజ‌న‌ల్‌ను మ్యాచ్ చేస్తూ రీమేక్ చేయ‌డం సులువైన వ్య‌వ‌హారం కాదు. ముఖ్యంగా క్లాసిక్ ల‌వ్ స్టోరీల రీమేక్‌ల విష‌యంలో వ్య‌తిరేక‌త మ‌రీ ఎక్కువగా క‌నిపిస్తోంది. అలాంటి సినిమాల్ని రీమేక్ చేయొద్ద‌ని ముందే జ‌నాలు స్టేట్మెంట్ ఇస్తున్నారు.

సామాన్య ప్రేక్ష‌కులు ఈ మాట అంటే ఓకే కానీ.. సినిమా వాళ్లు కూడా కొన్ని సినిమాల రీమేక్‌ల‌ను వ్య‌తిరేకించ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. '96' సినిమా ఆ కోవ‌లోనిదే. ఇలాంటి ల‌వ్ స్టోరీని రీక్రియేట్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని.. దీన్ని మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని చాలామంది అభిప్రాయ‌పడ్డారు. అందులో స్టార్ హీరోయిన్ స‌మంత కూడా ఉండ‌టం విశేషం.

కొన్ని రోజుల కింద‌ట స్వ‌యంగా స‌మంత '96'ను రీమేక్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని సోష‌ల్ మీడియాలో త‌న అభిప్రాయం వెల్ల‌డించ‌డం విశేషం. ఇప్పుడు అదే హీరోయిన్ '96' రీమేక్‌లో క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంది. ఇదే విష‌యాన్ని నిర్మాత దిల్ రాజు ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. అప్ప‌టికి '96' రీమేక్ గురించి స‌మంత‌కు తెలియ‌క తొంద‌ర ప‌డి ఆ మాట అంద‌న్నాడు. త‌ర్వాత స‌మంత‌ను క‌లిసి రీమేక్ గురించి మాట్లాడి.. త‌న పాత్ర గురించి వివరిస్తే సంతోషంగా ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్న‌ట్లు తెలిపాడు.

'96' రీమేక్ విష‌యంలో ఎంత వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. ఎన్ని విమ‌ర్శ‌లు త‌లెత్తినా.. తాము ధైర్యంగా ముంద‌డుగు వేస్తున్నామ‌ని.. ఇది తెలుగులోనూ మంచి సినిమా అవుతుంద‌ని అన్నాడు దిల్ రాజు. '96'త‌మిళంలో విడుద‌ల కాక‌ముందే.. దాని ట్రైల‌ర్ చూసి ఫిదా అయిపోయిన దిల్ రాజు.. ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాన పాత్ర‌ధారుల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల కార‌ణంగా రీమేక్ ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు శ‌ర్వానంద్-స‌మంత కాంబినేష‌న్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి దిల్ రాజు స‌న్నాహాలు మొద‌లుపెట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English