ప్రేక్షకులు పగ తీర్చుకున్నారన్న ఆమిర్

ప్రేక్షకులు పగ తీర్చుకున్నారన్న ఆమిర్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ అనగానే సక్సెస్‌కు చిరునామాగా చూస్తూ వచ్చారు జనాలు చాలా ఏళ్లుగా. గత రెండు దశాబ్దాల్లో ఆమిర్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఎలా ఎదిగాడో అందరికీ తెలిసిందే. 21వ శతాబ్దం ఆరంభంలో ‘దిల్ చాహ్‌తా హై’, ‘లగాన్’ లాంటి గొప్ప సినిమాలతో ఆమిర్ ఇమేజ్ మారిపోయింది. ఆ తర్వాత ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతూ పోయాడు. మధ్యలో ‘ది రైజింగ్’ మినహాయిస్తే అన్ని ఆమిర్ సినిమాలూ విజయం సాధించాయి. ఆమిర్ సినిమా అంటే కచ్చితంగా బాగుంటుందన్న నమ్మకంతో థియేటర్లకు వెళ్లిపోతున్నారు జనాలు.

‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ విషయంలోనూ అలాంటి నమ్మకంతోనే వెళ్లారు. కానీ ఆ చిత్రం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐతే అందరి లాగా ఫ్లాప్ సినిమాను కూడా హిట్ అని డబ్బా కొట్టుకోకుండా సినిమా థియేటర్లలో ఉండగానే ఇది ఫెయిల్యూర్ అని అంగీకరించాడు ఆమిర్. ఈ సినిమాతో నిరాశ పరిచినందుకు ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి ఆమిర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా ఏళ్లుగా తనకు ఫెయిల్యూర్ లేదని.. హిట్ సినిమాల ద్వారా జనాల నుంచి తాను చాలా తీసుకున్నానని.. దీంతో తాను ఎప్పుడు ఫ్లాప్ సినిమా తీస్తానా అని జనాలు ఎదురు చూశారని.. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమాతో ప్రేక్షకులకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందని అతను చమత్కరించాడు.

ఒక సినిమా గురించి నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పే హక్కు ప్రేక్షకులకు ఉందన్న ఆమిర్.. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’సినిమా విషయంలో తమ తీర్పును అలాగే చెప్పారన్నాడు. ఐతే ఈ సినిమా బాగుందని అన్నవాళ్లూ లేకపోలేదన్నాడు. ఎవరూ చెడ్డ సినిమా తీయాలని అనుకోరని.. ప్రతి సినిమా మంచిదనే, బాగా ఆడుతుందనే తీస్తారని.. ఒక్కోసారి ఫలితం తేడా కావచ్చని.. అలాంటపుడు దర్శకుడిని తప్పుపట్టనని... ఎందుకంటే అందులో తన వాటా కూడా ఉంటుందని.. సినిమా తీయడం అనేది సులువైన విషయం కాదని అందరూ అర్థం చేసుకోవాలని ఆమిర్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English