ప్లేస్.. టైం డిసైడ్ చేస్తే కొట్టేసుకుందాం : నాని

ఏపీలో రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా మారాయన్నది తెలిసిందే. ఎవరికి వారు తమ లక్ష్మణ రేఖల్ని దాటేస్తూ.. తమకు తగ్గ వాదనను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో బూతులు తిడతారా? అంటూ ఆవేదనగా ప్రశ్నిస్తూనే.. మరిన్ని బూతుల్ని ప్రయోగించటం కనిపిస్తోంది.

దీనికి వారి ప్రత్యర్థులు సైతం ఏ మాత్రం తగ్గకుండా.. తమ యథాశక్తితో మాటల్ని రువ్వుతున్నారు. ఇలాంటివేళ.. విజయవాడ ఎంపీ కమ్ సీనియర్ టీడీపీ నేత కేశినేని నాని మరింత ఘాటు వ్యాఖ్యను చేశారు.

ఇప్పటికే అధికార వైసీపీ.. విపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. మొన్న టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడికి సైతం పాల్పడిన వైనం చోటు చేసుకుంది. ఈ దాడికి నిరసనగా చంద్రబాబు.. నిరసన దీక్ష చేయగా.. దానికి ప్రతిగా జనాగ్రహ దీక్ష పేరుతో అధికార వైసీపీ నేతలు నిర్వహించారు. బాబు నిర్వహించిన దీక్షకు పెద్ద ఎత్తున జనం పార్టీ ఆఫీసుకు రావటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు సంఘీభావంగా కొందరు నేతలు మండిపడుతున్నారు.

తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా రియాక్టు అయిన తీరు మిగిలిన వారికికాస్త భిన్నంగా మారింది. ఇటీవల కాలంలో ఆయన టీడీపీని వదిలేసి.. బీజేపీలోకి చేరతారన్న ప్రచారం జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఆయన పార్టీ ఆఫీసుకు రావటం.. అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా వ్యవహరించి.. వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ అంటే వీరుడు.. సూరుడు అని చెప్పుకుంటారని.. ఏదైనా ఉంటే చెప్పండి.. డైరెక్టుగా ఫైట్ చేసుకుందామని సవాలు విసిరారు. ‘విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్సా? వీఎంసీ గ్రౌండ్సా ఏదో ఒకటి తేల్చేకుందాం. వైసీపీ నేతలు టైమ్.. డేట్ చెబితే మేమూ వచ్చేస్తాం. వైసీపీ ఎక్కడంటే అక్కడ మా వాళ్లు రెడీగా ఉన్నారు. కొట్టుకుందామంటే కొట్టేసకుందాం. రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డపేరు తేవొద్దు. జగన్ రాక్షస పాలన ప్రపంచమంతా చెప్పుకుంటోంది’ అంటూ నిప్పులు చెరిగారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా శాంతిభద్రతల సమస్య వచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన.. 2019లో జగన్ కు ప్రజలు గొప్ప అవకాశాన్ని ఇస్తే.. దాన్ని చెడగొట్టుకుంటున్నారన్నారు. ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది చెల్లుబాటుకాదని.. సరైన సమయంలో ఓటర్లు తగిన సమయంలో మూల్యం చెల్లిస్తారని వార్నింగ్ ఇచ్చారు.