క్రిష్.. ఒక స్టాండ్ మీద ఉండబ్బా

క్రిష్.. ఒక స్టాండ్ మీద ఉండబ్బా

‘మణికర్ణిక’ వివాదం విషయంలో కంగనా రనౌత్ ఎన్ని కబుర్లు చెప్పినా.. జనాల మద్దతు క్రిష్‌కే ఉంది. కంగనా యాటిట్యూడ్ ఎలాంటిదో బాలీవుడ్ జనాలకు బాగా తెలుసు కాబట్టి.. క్రిష్‌ను ఎవరూ తక్కువగా అంచనా వేయలేదు. ఈ సినిమా నుంచి తప్పుకోవడంలో క్రిష్ తప్పుందని భావించలేదు. క్రిష్ నుంచి దర్శకత్వ బాధ్యతలు అందుకుని సినిమాలో మార్పులు చేర్పులు చేయడంపై కంగనా ఎన్ని కబుర్లు చెప్పినా.. ఆమె ఇగో వల్లే క్రిష్‌ తప్పుకోవాల్సి వచ్చి ఉంటుందనే బాలీవుడ్ జనాలు కూడా అనుకున్నారు.

ఈ సినిమా రిలీజయ్యే ముందు వరకు క్రిష్ ఎంతో సంయమనంతో ఉండటాన్ని కూడా అందరూ అభినందించారు. ఐతే ఇప్పుడు కూడా తాను మాట్లాడకపోతే తన ఆత్మాభిమానం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో క్రిష్ బయటికి వచ్చాడు. కంగన మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులో క్రిష్ చెప్పిన మాటలు చాలా వరకు సహేతుకంగా ఉన్నాయి. అతడి వాదన అర్థవంతంగానే ఉంది.

కానీ ఒక విషయంలో మాత్రం క్రిష్ తడబడుతున్నాడు. ఒక స్టాండ్ మీద నిలవలేకపోతున్నాడు. సినిమాలో చాలా వరకు తాను తీసిన దృశ్యాలే ఉన్నాయని.. అలాంటపుడు దర్శకురాలిగా మేజర్ క్రెడిట్ కంగనా ఎలా తీసుకుటుందని క్రిష్ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. కంగనా తెరకెక్కించిన సన్నివేశాలు చాలా తక్కువని అంటున్నాడు. ఈ వాదనక కట్టుబడి ఆరోపణలు చేస్తే బాగానే ఉండేది. కానీ అదే సమయంలో భిన్నమైన వాదన వినిపిస్తున్నాడు. తాను అనుకున్న స్క్రిప్టును చాలా వరకు మార్చేశారని.. చరిత్రను వక్రీకరించారని అంటున్నాడు. తాను బంగారం లాంటి సినిమా తీస్తే కంగనా దాన్ని వెండిగా మార్చిందని అంటున్నాడు.

ఓవైపు తానే మెజారిటీ సినిమా తీశానంటాడు. మరోవైపు స్క్రిప్టును ఎలా పడితే అలా మార్చి సినిమాను చెడగొట్టారని అంటాడు. సినిమా గురించి ప్రశంసిస్తూ తనకు ముంబయి నుంచి ఫోన్లు వస్తున్నాయని ఓవైపు అంటూనే సినిమాను చెడగొట్టేసిందంటూ కంగనను తిట్టడంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు. అతను ఏదో ఒక స్టాండ్ తీసుకుని ఆరోపణలు చేస్తే బాగుంటందని.. ఇలా రెండు రకాలుగా మాట్లాడుతుండటంతో వాదన దెబ్బ తింటోందని అంటున్నారు జనాలు. క్రిష్ ఈ విషయంలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడో అర్థం కావడం లేదు మరి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English