విజయేంద్ర ప్రసాద్ ఏం మాట్లడడా?

విజయేంద్ర ప్రసాద్ ఏం మాట్లడడా?

రచయితగా విజయేంద్ర ప్రసాద్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా ఎంతో అభిమానం, గౌరవం సంపాదించుకున్నారాయన. దీని తర్వాత బాలీవుడ్‌లో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్క్రిప్టు అందించిన సినిమా ‘మణికర్ణిక’. ఈ సినిమా విషయంలో నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే.

తాను బంగారం లాంటి సినిమా తీసి పెడితే.. కంగనా రనౌత్ మొత్తం మార్చేసి, చరిత్రను వక్రీకరించి సినిమాను చెడగొట్టిందని క్రిష్ అంటున్నాడు. మరోవైపు కంగనా ఏమో.. క్రిష్ ఝాన్సీ లక్ష్మీబాయి కథను ఒక రివెంజ్ డ్రామాలా తీయాలనుకున్నాడని.. కానీ దానికి దేశభక్తి ప్రధానంగా ఈ చిత్రం పరిధిని పెంచుతూ మంచి సినిమా తీశానని కంగనా అంటోంది. కొన్ని రోజుల ముందు వరకు నాణేనికి ఒకవైపే చూస్తూ వచ్చాం. క్రిష్ మౌనంగా ఉంటే కంగనా తన వెర్షన్ వినిపిస్తూ సాగింది.

కానీ ఇప్పుడు క్రిష్ నోరు విప్పాడు. కంగనపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆమె కథను, పాత్రల్ని ఎలాపడితే అలా మార్చేసిందన్నాడు. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ పెదవి విప్పాల్సిన అవసరం వచ్చింది. కథను మార్చడం విషయంలోనే వివాదం నడుస్తోంది. ఐతే ఈ చిత్రానికి కథ అందించిందే విజయేంద్ర ప్రసాద్. మరి క్రిష్ పూర్తి సినిమా తీశాక.. స్క్రిప్ట్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ప్రమేయం లేకుండా.. ఆయన్ని అడక్కుండా కంగనా కథను మార్చిందా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం అవుతోంది.

క్రిష్ బయటికి వచ్చాక కూడా విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్ర బృందంతోనే ఉన్నాడు. కంగనా తన సలహాలు కూడా తీసుకున్నట్లు చెప్పాడు. అలాంటపుడు క్రిష్ అన్నట్లు కంగన చరిత్రను వక్రీకరిస్తుంటే.. కథను ఇష్టానుసారం మారుస్తుంటే విజయేంద్ర ప్రసాద్ ఎలా ఊరుకున్నాడన్నది ప్రశ్న. ఆయనకు అది తప్పనిపించలేదా.. అలా కానపుడు క్రిష్ ఈ కథను సరిగా డీల్ చేయలేదని, మార్పులు అవసరమని విజయేంద్ర కూడా భావించే కంగన వైపు నిలిచారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇంతకుముందు ఈ సినిమా వివాదం విషయంలో వివాదానికి తావు లేకుండా డిప్లమాటిగ్గా మాట్లాడిన విజయేంద్ర.. ఇప్పటికైనా ఓపెన్ కావాలి. ఎవరి వైపు న్యాయం ఉందో చెప్పాలి. ఆయన మాటను బట్టే జనాలు ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశముంటుంది.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English