తెలంగాణ ప్రభుత్వంపై మోహన్ బాబు విమర్శలు

తెలంగాణ ప్రభుత్వంపై మోహన్ బాబు విమర్శలు

మంచు మోహన్ బాబు కొన్నిసార్లు ఎంతటి వారి మీద అయినా విమర్శలు గుప్పిస్తుంటాడు. మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటాడు. ఈ మధ్య ‘యన్.టి.ఆర్’ ఆడియో వేడుకకు వచ్చి చంద్రబాబు మీద పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన తెలంగాణ ప్రభుత్వం మీద పరోక్ష విమర్శలు గుప్పించడం గమనార్హం. తన గురువు దర్శక రత్న దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణ కోసం మోహన్ బాబు పాలకొల్లుకు వెళ్లారు.

అక్కడ విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగిస్తూ.. దాసరి సొంతూరిలో ఇంత గొప్పగా విగ్రహం పెడితే.. ఆయన ఎంతో సేవ చేసిన హైదరాబాద్‌లో మాత్రం విగ్రహం ఏర్పాటుకు ఐదు గజాల స్థలం కూడా ఇవ్వలేదని మోహన్ బాబు అన్నారు. ప్రభుత్వం అని చెప్పకపోయినప్పటికీ.. స్థలం ఇవ్వలేదని అనడం ప్రభుత్వాన్ని ఉద్దేశించే అని భావిస్తున్నారు.

సినీ జనాలందరూ ముందు నుంచి కేసీఆర్ సర్కారు విషయంలో భయ భక్తులతో మెలుగుతున్న సంగతి తెలిసిందే. అందులోనూ రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ భయం మరింత పెరిగింది. ఇలాంటి తరుణంలో మోహన్ బాబు ఆవేశపడి ఇలా మాట్లాడేశారేంటని అంటున్నారు. మరోవైపు దాసరి గురించి మాట్లాడుతూ మోహన్ బాబు ఉద్వేగానికి గురయ్యారు. భక్తవత్సలం నాయుడిగా ఉన్న తనను మోహన్ బాబుగా మార్చి గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఘనత దాసరిదే అన్నారు.

తనలా ఇంకెంతోమంది శిష్యులను తయారు చేశాడన్నారు. ఎంత పెద్ద నటులైనా సరే.. దాసరి తాను సినిమా చేస్తానని అడగలేదని.. అందరూ ఆయనతో పని చేసే అవకాశం కోసం వెంపర్లాడారని.. అది దాసరి గొప్పదనం అని మోహన్ బాబు అన్నారు. దాసరి గౌరవార్థం ఆయన సొంతూరైన పాలకొల్లు నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు తన విద్యా నికేతన్ కాలేజీలో ఉచితంగా ఇంజినీరింగ్ చదివే అవకాశం కల్పిస్తానని మోహన్ బాబు హామీ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English