చిన్న సినిమా నుంచి భారీ చిత్రాలకు?

తెలుగులో చేసిన తొలి చిత్రం ఓ చిన్న హీరోతో. దాని బడ్జెట్ కూడా తక్కువ. పైగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇలా కెరీర్‌ను ఆరంభించిన అమ్మాయికి ఇండస్ట్రీలో ముందంజ వేయడం చాలా కష్టమే. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం తొలి సినిమా స్థాయి, ఫలితంతో సంబంధం లేకుండా తర్వాత అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మీనాక్షి చౌదరి ఆ కోవకు చెందిన అమ్మాయిలాగే కనిపిస్తోంది.

2018లో మిస్ ఇండియా అయిన ఈ ఉత్తరాది బ్యూటీ.. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్ సరసన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే మీనాక్షికి తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. రవితేజ సరసన ‘ఖిలాడి’లో ఆమె రెండో కథానాయికగా ఎంపికైంది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’కి కూడా ఆమెనే కథానాయికగా ఎంపిక చేశారు. ఇవి రెండూ క్రేజీ చిత్రాలే కావడంతో మీనాక్షి తెలుగులో కథానాయికగా సెటిలైపోయేలాగే కనిపిస్తోంది.

ఐతే ఇప్పటిదాకా అందుకున్న అవకాశాలు ఒకెత్తయితే.. ఇప్పుడు ఆమె రెండు భారీ చిత్రాలకు పరిగణనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ హీరోలు ప్రభాస్, మహేష్ బాబులు కావడం విశేషం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘సలార్’లో ఒక ప్రత్యేక పాత్ర కోసం మీనాక్షిని ఎంచుకున్నారట. ఇందులో ఆమెది కథానాయిక పాత్ర కాదు. శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించబోయే సినిమాలో మీనాక్షి ఒక కథానాయికగానే నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే మీనాక్షి దశ తిరిగినట్లే. ఆమె కెరీర్ పీక్స్‌ను అందుకోబోతున్నట్లే. మరి ఈ వార్తలు ఎప్పుడు అధికారికం అవుతాయో చూడాలి.