సమంతకు ఏం ఛాన్స్ వచ్చిందిలే..

సమంతకు ఏం ఛాన్స్ వచ్చిందిలే..

మొత్తానికి '96' తెలుగు రీమేక్ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష పోషించిన ప్రధాన పాత్రలను ఇక్కడ తెలుగులో శర్వానంద్, సమంత చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. '96' మీద అపార నమ్మకంతో ఆ సినిమా విడుదల కాకముందే రీమేక్ హక్కులు తీసుకున్న దిల్ రాజు.. లీడ్ పెయిర్‌ను ఓకే చేయడానికి చాలా సమయమే తీసుకున్నాడు. చివరికి శర్వా-సమంత ఖరారయ్యారు. ఒరిజినల్ తీసిన ప్రేమ్ కుమారే తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. తమిళ వెర్షన్ చూసిన వాళ్లెవరైనా.. ఈ సినిమాకు శర్వా, సామ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనే అంటారు. ఇద్దరూ మంచి పెర్ఫామర్లు కావడం.. తమ నటనతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వాళ్లు కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష పోటీ పడి మరీ నటించారు. వాళ్లను మ్యాచ్ చేయగల సమర్థులే శర్వా, సమంత. ఇప్పటికే 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సినిమాలో శర్వా ఈ తరహా పాత్రే చేశాడు కాబట్టి అతడికి ఈ రోల్ కొట్టిన పిండే. అతడి ఎంపిక కూడా జనాలకు అంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. ఇలాంటి గాఢమైన, ఫీల్ ఉన్న ప్రేమకథలో మరో హీరోతో కలిసి నటించడం అనేది కొంచెం ఆశ్చర్యమైన విషయమే. కాకపోతే ఈ చిత్రంలో ఫిజికల్ రొమాన్స్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి అక్కినేని అభిమానులు ఫీలవ్వాల్సిన పని లేదు.

తమిళంలో త్రిష పనైపోయిందనుకున్న తరుణంలో.. ఆమెను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోని స్థితిలో '96' లాంటి మంచి ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో త్రిష మళ్లీ తన అభిమానుల్ని మురిపించింది. ఆమెను లైట్ తీసుకుంటున్న వాళ్లను కూడా ఫిదా చేసింది. సమంతకు తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. గత దశాబ్ద కాలంలో సమంత అంత ఆదరణ తెచ్చుకున్న హీరోయిన్ మరొకరు కనిపించరు. తన వ్యక్తిత్వంతో కూడా ఆమె అభిమానుల మనసు గెలుచుకుంది. ఇంత పాజిటివిటీ ఉన్న హీరోయిన్ '96' లాంటి సినిమాలో కీలక పాత్ర చేస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులుండవు. తమిళంలో ఉన్నంత ఎఫెక్టివ్‌గా సినిమాను తీర్చిదిద్దితే.. కచ్చితంగా సమంత కెరీర్లో ఇది మరో మైలురాయిలా నిలవడం ఖాయం.

 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English