నా పేరు సూర్య.. గొడవలయ్యాయట

నా పేరు సూర్య.. గొడవలయ్యాయట

నా పేరు సూర్య.. అల్లు అర్జున్ కెరీర్లో అత్యధిక అంచనాలతో విడుదలైన సినిమా. ఇది బన్నీ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందని.. రికార్డుల మోత మోగించేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ విడుదల తర్వాత కథ మొత్తం రివర్సయింది. బన్నీ కెరీర్లో అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమా చాలామందికి న్యాయం చేయాలని చూశాడు బన్నీ.

దర్శకుడిగా వక్కంతం వంశీని నిలబెట్టడంతో పాటు తన మిత్రుడు బన్నీ వాసుకి.. తన మావయ్య నాగబాబుకి.. వీరితో పాటు లగడపాటి శ్రీధర్‌కు కూడా ఆర్థికంగా మంచి ప్రయోజనం కలిగించాలని అనుకున్నాడు. కానీ ఆ ఆశలేవీ ఫలించలేదు. రిలీజ్ తర్వాత చాలా సెటిల్మెంట్లు చేయాల్సి వచ్చి ఒత్తిడి ఎదుర్కొన్నాడు. తన తర్వాతి సినిమా విషయంలో ఒక పట్టాన ఓ నిర్ణయానికి రాలేకపోవడానికి కూడా ‘నా పేరు సూర్య’ ఫెయిల్యూరే కారణం.

ఐతే ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పని బన్నీ.. ఎట్టకేలకు స్పందించాడు. మలయాళ డబ్బింగ్ సినిమా ‘లవర్స్ డే’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ.. ‘నా పేరు సూర్య’ ప్రస్తావన తెచ్చాడు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వినోద్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ.. అతను తనకు పెద్ద ఫ్యాన్ అంటూ ‘నా పేరు సూర్య’ టైంలో బన్నీ వాసు పరిచయం చేశాడని.. అతను ‘నా పేరు సూర్య’ను ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడని తెలిపాడు.

ఐతే తర్వాత ‘నా పేరు సూర్య’ అనుకోకుండా ఫెయిల్ అయిందని.. దీంతో కొన్ని గొడవలు వచ్చాయని అన్నాడు. ఆ పరిస్థితుల్లో అందరికీ సెటిల్మెంట్ చేయాల్సి వచ్చిందని.. అప్పుడు బన్నీ వాసు తన దగ్గరికి వచ్చి వినోద్ రిలీజ్‌కు ముందు ఎలా ఉన్నాడో, తర్వాత కూడా అలాగే ఉన్నాడని చెప్పాడని.. దీంతో టైం వచ్చినపుడు అతడికి ఏమైనా చేయాలనుకున్నానని.. అందుకే ‘లవర్స్ డే’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతడి కోసం వచ్చానని వెల్లడించాడు బన్నీ. దీన్ని బట్టి చూస్తే వినోద్ లాంటి ఒకరిద్దరు మినహా బయ్యర్లందరూ నష్టాల విషయంలో గొడవ చేసి.. బన్నీతో సెటిల్ చేయించుకున్నారన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English