నాగ్ కరుణించాడట.. చైతూ కూడా ఉన్నాడట

నాగ్ కరుణించాడట.. చైతూ కూడా ఉన్నాడట

'ఆఫీసర్' తర్వాత అక్కినేని నాగార్జున తెలుగులో సోలో హీరోగా సినిమానే అనౌన్స్ చేయలేదు. మధ్యలో మల్టీస్టారర్ మూవీ 'దేవదాస్'లో నటించిన నాగ్.. అది విడుదలైనప్పటి నుంచి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. హిందీలో 'బ్రహ్మాస్త్ర'.. మలయాళంలో 'మరక్కార్' సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తున్న నాగ్.. తమిళంలో ధనుష్ దర్శకత్వంలో 'రుద్ర' అనే సినిమాలో నటించాల్సి ఉంది.

ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుండటంతో ప్రస్తుతానికి నాగ్ ఖాళీగానే ఉన్నాడు. ఐతే ఇటీవలే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు-2' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. దానికి స్క్రిప్టు లాక్ అయిపోయినట్లు చెబుతున్నారు. ఇది ఓకే అయిందంటే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో 'సోగ్గాడే చిన్నినాయనా' ప్రీక్వెల్ 'బంగార్రాజు' డౌటే అనుకున్నారంతా.

ఐతే తాజా సమాచారం ప్రకారం నాగ్ ఆ సినిమాకు కూడా పచ్చ జెండా ఊపేశాడట. సీనియర్ రైటర్ సత్యానంద్ సహకారంతో కళ్యాణ్ 'బంగార్రాజు' స్క్రిప్టును పక్కాగా రెడీ చేసి నాగార్జును మెప్పించాడట. 'మన్మథుడు-2' తర్వాత ఇది చేద్దామని.. స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దమని నాగ్ చెప్పాడట. ఈ రెండు చిత్రాలనూ నాగ్ సొంత బేనర్లోనే ప్రొడ్యూస్ చేయనున్నాడు.

'బంగార్రాజు'లో నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్య కూడా ఒక కీలక పాత్ర చేస్తాడని సమాచారం. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపిస్తాడట. నాగ్-చైతూ ఇంతకుముందు 'మనం' లాంటి మరపురాని సినిమాలో నటించారు. మళ్లీ ఇద్దరూ నటించాలంటే అది చాలా ప్రత్యేకమైన సినిమా అయ్యుండాలని భావించారు. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో చైతూకు కూడా మంచి హిట్ ఇచ్చాడు కళ్యాణ్. ఇప్పుడు తండ్రీ కొడుకులిద్దరినీ ఒకేసారి డైరెక్ట్ చేయబోతుండటం ఆసక్తి రేకెత్తించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English