వినయ విధేయ రామ.. పంపకాలు మొదలయ్యాయ్

 వినయ విధేయ రామ.. పంపకాలు మొదలయ్యాయ్

ఇంతకుముందులా సినిమా డిజాస్టర్ అయితే మాకేం సంబంధం లేదని నిర్మాతలు చేతులు దులుపుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటే.. డిస్ట్రిబ్యూటర్లతో సత్సంబంధాలు నడపాల్సిందే. వారు నిండా మునిగిపోతుంటే ఆదుకోవాల్సిందే. ఒక సినిమాకు భారీ నష్టాలు వస్తే బయ్యర్లు కొంచెం ఆదుకుంటే తప్ప తర్వాతి సినిమాకు బిజినెస్ జరగడం కష్టం.

అందుకే నిర్మాతలు చాలా వరకు ఈ మధ్య డిజాస్టర్ అయిన సినిమాలకు బయ్యర్లకు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. తాజాగా సంక్రాంతికి విడుదలై బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చి పెట్టిన 'యన్.టి.ఆర్', 'వినయ విధేయ రామ' సినిమాల విషయంలో ఇదే జరుగుతున్నట్లు సమాచారం. 'యన్.టి.ఆర్-కథానాయకుడు'తో నష్టపోయిన బయ్యర్లకు యన్.టి.ఆర్-మహానాయకుడు' ఉచితంగా ఇచ్చి సర్దుబాటు చేసే ప్రయత్నంలో నిర్మాత నందమూరి బాలకృష్ణ ఉండగా.. 'వీవీఆర్' ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సైతం ఇదే పనిలో పడ్డట్లు సమాచారం.

రూ.90 కోట్లకు 'వీవీఆర్' అమ్మకాలు జరగ్గా ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.65 కోట్ల దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం రూ.25 కోట్ల నష్టాలు బయ్యర్లకు తప్పేలా లేవు. అమెరికాలో అయితే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన బయ్యర్‌కు రూపాయి కూడా వెనక్కి రాలేదు. వచ్చిన ఆదాయం రిలీజ్ ఖర్చులకే సరిపోయింది. సినిమాను ఎంతకు కొన్నాడో ఏమో కానీ.. దానయ్య అయితే అతడికి రూ.50 లక్షల దాకా పరిహారం అందించనున్నట్లు తెలిసిందే.

దీని తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్లకు కూడా సెటిల్మెంట్ చేయాలని దానయ్య భావిస్తున్నట్లు సమాచారం. దానయ్య గత సినిమా 'భరత్ అనే నేను' ఆయనకు బాగానే లాభాలు అందించింది. ఐతే ఆ సినిమా కొన్న బయ్యర్లకు మాత్రం పెద్దగా మిగిలింది లేదు. దాదాపుగా అసలు వెనక్కి వచ్చిందంతే. ఇప్పుడు 'వీవీఆర్'తో వాళ్లు బాగా నష్టపోయారు. ఇప్పుడు వాళ్లకు పరిహారం అందించకుంటే మున్ముందు కష్టమవుతుంది. అందుకే ఆయన పంపకాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English