స‌జ్జ‌ల‌ను సైలెంట్ చేస్తారా?

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. పేరుకే అధికార వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కానీ సీఎం జ‌గ‌న్ త‌ర్వాత అటు ప్ర‌భుత్వంలో.. ఇటు పార్టీలో తానే నంబ‌ర్ టూ అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాల కౌంట‌ర్‌కు ఆయ‌నే స‌మాధానం ఇస్తారు. ప్ర‌భుత్వంలో ఏ శాఖ గురించి అయినా ఆయ‌నే మాట్లాడ‌తారు. ఆరోగ్యశాఖ విద్యాశాఖ‌.. ఇలా ఆ శాఖ ఈ శాఖ అని కాకుండా అన్ని శాఖ‌ల గురించి ఆయ‌నే మాట్లాడ‌తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తి రోజు అన్ని విష‌యాల‌పై ఆయ‌నే స్పందిస్తుండ‌డంతో అస‌లు ఏపీలో ఏ శాఖ‌కు ఎవ‌రు మంత్రో అన్న‌ది ప‌క్క‌న పెడితే అస‌లు మంత్రులు ఎవ‌రో కూడా పేర్లు చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంద‌ని టాక్‌.

అయితే పార్టీలో ప్ర‌భుత్వంలో ఇలా స‌జ్జ‌ల అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డం వైసీపీ నేత‌ల‌కే న‌చ్చ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు చెప్పిన‌ట్లు స‌జ్జ‌ల స‌క‌ల శాఖ మంత్రిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న‌పై పార్టీ నేత‌ల్లో మంత్రుల్లో భారీ అసంతృప్తి ఉంద‌ని వాళ్లు అదును కోసం ఎదురు చూస్తున్నార‌ని తెలిసింది. ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా స‌జ్జ‌ల త‌న ఇష్టానుసారం అధికారం చూపిస్తున్నార‌ని పార్టీ నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై దృష్టి సారించిన జ‌గ‌న్ స‌జ్జ‌ల‌ను సైలెంట్ చేసే ప‌నిలో ప‌డ్డ‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

స‌జ్జ‌ల వల్ల చాలా మంది మంత్రులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌నే అభిప్రాయాలున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అందుబాటులో లేని స‌మ‌యంలో వివిధ మంత్రిత్వ శాఖ‌ల కోసం మాట్లాడే ఏకైక వ్య‌క్తిగా స‌జ్జ‌ల‌నే క‌నిపిస్తున్నార‌నే టాక్ ఉంది. మీడియాతో ఏం మాట్లాడాల‌నే విష‌యాల‌ను కూడా మంత్రుల‌కు సజ్జ‌ల‌నే చెబుతున్నారని మంత్రుల‌ను ఎమ్మెల్యేల‌ను ఆయ‌నే నిర్దేశిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అమ‌రావ‌తి స‌చివాలయంలో ఉన్న ఏకైక వీఐపీ స‌జ్జ‌ల మాత్ర‌మేన‌ని వైసీపీ వ‌ర్గాలే అంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో అంద‌రిపై పెత్త‌నం చ‌లాయిస్తున్న స‌జ్జ‌ల అంటే పార్టీ నేత‌లకు న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. అలా అనీ స‌జ్జ‌ల‌ను వ‌దులుకోవ‌డానికి జ‌గ‌న్ ఏం మాత్రం ఇష్ట‌ప‌డ‌ర‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే ప్ర‌తిప‌క్షాల‌కు ఎలా కౌంట‌ర్ ఇవ్వాలి? ఏ స‌మ‌యంలో ఎలా మాట్లాడాలి? అనే అంశాల‌పై స‌జ్జ‌ల‌కు మంచి ప‌ట్టుంది. అందుకే ఆయ‌న జ‌గ‌న్ అభిమానాన్ని చూర‌గొన్నారు. కానీ పార్టీలో రోజురోజుకూ స‌జ్జ‌ల‌పై అసంతృప్తి పెరిగిపోతున్న నేప‌థ్యంలో.. ఆయ‌న‌ను ఓ శాఖ‌కు మంత్రిని చేసే ప‌నిలో జ‌గ‌న్ ఉన్నార‌ని ఎమ్మెల్సీగా తీసుకుని ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాలనే యోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ విధంగా ఆయ‌న‌ను కాస్త సైలెంట్ చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.