బిగ్ బాస్-3 చేస్తారా అని వెంకీని అడిగితే..

బిగ్ బాస్-3 చేస్తారా అని వెంకీని అడిగితే..

ఎన్నో సందేహాల మధ్య తెలుగులోకి వచ్చిన ‘బిగ్ బాస్’.. ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ విజయవంతమైంది. తొలి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ నడిపిస్తే.. రెండో సీజన్లో నాని వ్యాఖ్యాతగా మెప్పించాడు. ఐతే ఈ షో జనాదరణ పొందింది కానీ.. దానికి పూర్తి పాజిటివిటీ ఉందని అనలేం. రెండో సీజన్‌కు ఎన్టీఆర్ కొనసాగకపోవడం చాలామందికి నిరాశ కలిగించింది. నాని తన వంతుగా షోను బాగానే నడిపించినా.. అతను కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో మూడో సీజన్‌కు హోస్ట్ ఎవరని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈసారి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో మా టీవీ డీల్ పూర్తయినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఐతే ఈ విషయాన్ని ఎవ్వరూ ధ్రువీకరించట్లేదు.

మరి ‘ఎఫ్-2’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన వెంకీని ఇదే విషయం ప్రస్తావిస్తే.. తాను ఈ షో చేయబోవట్లేదని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ఐతే తనతో సంప్రదింపులు జరగలేదని మాత్రం వెంకీ అనలేదు. ‘బిగ్ బాస్’తో పాటుగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలు రెంటికీ ముందు తననే అడిగారని.. కానీ తాను ఒప్పుకోలేదని వెంకీ వెల్లడించడం విశేషం.

వెంకీ ఇంత కచ్చితంగా చెప్పాడంటే.. ఆయన ‘బిగ్ బాస్-3’ చేయట్లేదనే భావించాలి. వెంకీ తర్వాత ఎక్కువ వినిపించిన పేరు విజయ్ దేవరకొండదే. మంచి సెన్సాఫ్ హ్యూమర్, కమాండ్ ఉన్న విజయ్ అయితే ఈ షోను రక్తి కట్టిస్తాడని.. తనదైన ముద్ర వేస్తాడని భావిస్తున్నారు. కానీ అతడికి ఇప్పుడున్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ‘బిగ్ బాస్’కు డేట్లు కేటాయించడం కష్టమే. అసలతడికి ఈ షో విషయంలో ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా చూడాలి. మరి మా టీవీ వాళ్లు ఎవరిని హోస్ట్‌గా ఫైనలైజ్ చేస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English