రాజకీయాలపై ఆ స్టార్ తేల్చి చెప్పేశాడు

రాజకీయాలపై ఆ స్టార్ తేల్చి చెప్పేశాడు

సినీ తారలు రాజకీయాల వైపు చూడటం అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంది. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో ఈ ఒరవడి బాగా ఎక్కువ. కొన్ని దశాబ్దాల పాటు సినీ తారలే తమిళనాడును ఏలారు. జయ మరణానంతరం అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠంపై పళని స్వామి కూర్చున్నాడు. వచ్చే ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ పోటీ పడనున్న నేపథ్యంలో వారిలో ఒకరు ముఖ్యమంత్రి అయితే ఆశ్చర్యమేమీ లేదు.
ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో వీళ్లిద్దరూ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. వీరి తర్వాతి తమిళనాడులో పెద్ద స్టార్లయిన విజయ్, అజిత్ కూడా రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. విజయ్ ఆ దిశగా తన సినిమాలతో సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. విజయ్‌కు దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ విషయంలోనూ రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి.

ఐతే అజిత్ మాత్రం ఈ ప్రచారానికి ఒక్క ప్రకటనతో తెరదించేశాడు. తన రాజకీయారంగేట్రం గురించి తరచుగా వార్తలొస్తుండటంతో అజిత్ ఒక పత్రికా ప్రకటన ఇచ్చాడు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరం అని స్పష్టం చేశాడు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని.. తన పేరును, ఫొటోను ఎవ్వరూ ఉపయోగించవద్దని.. అలాగే తనకు ఏదైనా పార్టీతో సంబంధం ఉందని ఎవరైనా అంటే కూడా నమ్మొద్దని అజిత్ స్పష్టం చేశాడు.

ఇప్పటిదాకా తాను ఎప్పుడూ ఫలానా పార్టీకి మద్దతివ్వండి, ఓటు వేయండి అని అభిమానులకు చెప్పలేదని.. ఇక ముందూ చెప్పబోనని.. ఆ విషయంలో ఎవరిష్టం వాళ్లదని అతను తేల్చి చెప్పాడు. తనకు రాజకీయాలతో ఉన్న సంబంధం.. కేవలం ఓటు వేయడం వరకే అని అజిత్ అన్నాడు. రాజకీయ పార్టీల విషయంలో తనకు వ్యక్తిగతంగా ఇష్టాలున్నాయని.. అలాగే ఎవరిష్టం వాళ్లదని చెప్పాడు. అలాగే తన సినిమాల్ని విమర్శించే క్రిటిక్స్‌‌ను లక్ష్యంగా చేసుకోవద్దని.. ఎవరి స్వేచ్ఛ వాళ్లకు ఉండాలని అభిమానులకు హితవు పలికాడు అజిత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English