ఎన్టీఆర్-బాలయ్య.. పైపై మాటలే

ఎన్టీఆర్-బాలయ్య.. పైపై మాటలే

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య బంధం ఈ మధ్య కాలంలో ఎన్ని మలుపులు తిరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల పాటు వీళ్లిద్దరి మధ్య మాటల్లేవు. ఒకరి గురించి ఒకరు ఎక్కడా మాట్లాడింది లేదు. బహిరంగంగా కలిసిందీ లేదు. ఐతే హరికృష్ణ మరణంతో సమీకరణాలు మారాయి. బాలయ్య తారక్‌తో సన్నిహితంగా మెలిగాడు. తన అన్న మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేసినట్లు కనిపించాడు. బాలయ్య-తారక్ కలిసి సన్నిహితంగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్న ఒక వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఐతే హరికృష్ణ మరణించిన కొన్ని రోజుల తర్వాత బాలయ్య-తారక్ మధ్య మళ్లీ దూరం పెరిగినట్లు కనిపించింది. కానీ ఆపై ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌కు బాలయ్య వచ్చి ఆశ్చర్యపరిచాడు. మధ్యలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సుహాసిని కోసం బాలయ్య ప్రచారం చేస్తే తారక్ మాత్రం దూరంగా ఉండిపోయాడు.

దీంతో మళ్లీ బాలయ్య-తారక్ బంధంపై అనుమానాలు ముసురుకున్నాయి. కానీ ‘యన్.టి.ఆర్’ ఆడియో వేడుకకు తారక్‌ను బాలయ్య పిలవడం.. అతను మాట మన్నించి ఆ వేడుకకు వచ్చి బాలయ్య గురించి గొప్పగా మాట్లాడటం అందరూ చూశారు. దీంతో నందమూరి అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం వచ్చింది. బాబాయ్-అబ్బాయ్ మధ్య విభేదాలేమీ లేవనే అంతా అనుకున్నారు. కానీ మళ్లీ పరిస్థితి చేస్తుంటే సందేహాలు కలుగుతున్నాయి. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమాను ఇంత వరకు ఎన్టీఆర్ చూసినట్లు లేడు. ఒకవేళ చూసి ఉన్నా.. ఇప్పటి వరకు అయితే సినిమా గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. ఎన్టీఆర్ సినిమా తీసి బాలయ్య గొప్ప పని చేశాడని.. తన పిల్లలకు ఆయన గురించి చెబుతానని.. ఇలా ఆడియో వేడుకలో పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు తారక్. అప్పుడు బాలయ్యతో అతడి బంధంపై ఉన్న సందేహాలన్నీ తొలగిపోయినట్లే కనిపించింది. కానీ ఇవన్నీ పైపై మాటలే.. లోపల వ్యవహారాలు వేరని ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ‘యన్.టి.ఆర్’ సినిమాకు సెలబ్రెటీలు, టాలీవుడ్లోని ప్రముఖ కుటుంబాల వ్యక్తులు మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుండగా.. అసలు స్వయంగా ఎన్టీఆరే ఒక్క ముక్కా మాట్లాడకపోవడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ స్థితిలో బాలయ్యతో తారక్‌కు ఏ సమస్యా లేదని.. ఇద్దరి మధ్య అంతా బాగుందని ఎలా అనుకుంటాం?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English