వైసీపీ.. తప్పు మీద తప్పు

ఆర్నెల్ల ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌లో తర్వాతి ఎన్నికల్లో విజయం ఎవరిది అని అడిగితే.. వైసీపీదే అని ధీమాగా చెప్పే పరిస్థితి ఉండేది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న జనాల్లో జగన్ సర్కారు పట్ల సానుకూలతే ఉందని.. కాబట్టి మరో పర్యాయం జగన్‌కు ఢోకా లేదనే అంటుండేవాళ్లు రాజకీయ విశ్లేషకులు. కానీ గత ఆరు నెలల్లో వేగంగా పరిస్థితులు మారిపోయాయన్నది విశ్లేషకుల మాట.

పెట్రోలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవడం.. విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు ఎక్కువైపోవడం.. దీనికి తోడు ఎమ్మెల్యేలు పనితీరు దారుణంగా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా సమయానికి జీతాలు, పెన్షన్లు రాక ఉద్యోగులు ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నది స్పష్టం.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి మరిన్ని తప్పులు జరగకుండా చూసుకోవడం చాలా అవసరం. అనవసర వివాదాలు కొని తెచ్చుకోవడం చాలా చేటు చేస్తుంది. ఇది గుర్తించకుండా తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దారుణమైన రీతిలో దాడి చేయడం ద్వారా వైసీపీ ఉచ్చులో పడింది. ఇలాంటి దాడులు రహస్యంగా, రాత్రి వేళల్లో చేస్తే తమ మీదికి నింద రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పగటి పూట కెమెరాల కళ్లల్లో పడేలా దాడులు చేశారు. ఇది తమ పని కాదు అని బుకాయించడానికి కూడా వీల్లేకపోయింది. టీడీపీ ఆఫీస్ మీదికి వచ్చిన వాహనాలు వైసీపీ వాళ్లవని సాక్ష్యాలు కూడా బయటపెట్టారు టీడీపీ వాళ్లు.

ఇదిలా ఉంటే ఏ ఉద్దేశంతో, ఏ కారణంతో దాడులు చేసినా.. వాటిని ఎవ్వరైనా ముందు ఖండించాలి. దాడులతో తమకు సంబంధం లేదని.. విచారణ జరిపిస్తామని.. దోషులను శిక్షిస్తామని మొక్కుబడి మాటలైనా చెప్పి ఉండాలి సీఎం. కానీ ఆయన చిత్రంగా దాడులు తమ అభిమానుల పనే అని, టీడీపీ వాళ్లు బూతులు మాట్లాడటంతో తన అభిమానులకు బీపీ వచ్చి దాడులు చేశారని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. దాడిని ఖండించే ప్రయత్నమే చేయలేదు.

ఐతే బూతులు మాట్లాడ్డం, దుర్భాషలాడటమే పెద్ద నేరం అయితే అందులో కొడాలి నాని సహా వైసీపీ నేతలు వాడే బూతుల మాటేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో వైసీపీ నేతలకంటే దిగజారి మాట్లాడేవాళ్లు ఎవరైనా ఉంటారా? అలాంటపుడు జగన్ సమర్థింపు ఎంత వరకు సమంజసం? మొత్తానికి దాడి చేయడమే తప్పంటే.. దాన్ని సమర్థించుకోవడం ద్వారా వైసీపీ తప్పు మీద తప్పు చేసి అప్రతిష్ట పాలవుతుందోన్నది స్పష్టం.