అఖిల్ మాటలు నమ్మొచ్చా?

అఖిల్ మాటలు నమ్మొచ్చా?

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు ‘మిస్టర్ మజ్ను’ మీదే ఉన్నాయి. మాస్ మసాలా సినిమాతో అరంగేట్రం చేయాలన్న ఆలోచన బెడిసికొట్టాక.. ఎంతో జాగ్రత్తగా చేసిన ‘హలో’ కూడా తేడా కొట్టేయడంతో ఎటూ పాలుపోని అయోమయంలో పడిపోయాడు అఖిల్. అలాంటి సమయంలోనే ‘తొలి ప్రేమ’తో హిట్టు కొట్టి సత్తా చాటిన వెంకీ అట్లూరిని అర్జెంటుగా బుక్ చేసి.. తన రెండో కొడుకుతో సినిమా చేయించాడు నాగార్జున.

ఎక్కడైనా యంగ్ టాలెంట్ కనిపిస్తే వెంటనే లాక్ చేసేయడం నాగార్జునకు అలవాటు. అందులోనూ ఇద్దరు కొడుకులూ సినిమాల్లో బిజీ అయ్యాక వారి గురించి కూడా ఆలోచిస్తూ యువ దర్శకుల నుంచి కమిట్మెంట్లు తీసుకుంటున్నాడు. చందూ మొండేటి, సుధీర్ వర్మ లాంటి దర్శకుల్ని అలాగే లైన్లో పెట్టాడు. ఈ కోవలోనే వెంకీని అఖిల్ కోసం కమిట్ చేయించాడు.

ఐతే ‘తొలి ప్రేమ’ సక్సెస్ చూశాకే వెంకీని అఖిల్ కోసం తీసుకొచ్చాడని అంతా అనుకుంటుండగా.. అఖిల్ మాత్రం అలాంటిదేమీ లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. వెంకీతో తన మూడో సినిమా చేయాలన్నది మూడేళ్ల కిందటి కమిట్మెంట్ అని అతను చెప్పడం విశేషం. వెంకీతో తనకు పదేళ్లుగా పరిచయం ఉందని.. మూడేళ్ల కిందటే వచ్చి ‘మిస్టర్ మజ్ను’ కథ చెప్పాడని.. ఐతే అరంగేట్రానికి ఆ సినిమా సెట్టవ్వదని.. తనకు మూడో సినిమాగా అయితే ఇది బాగుంటుందని చెప్పి.. అతడిని ఆపానని.. ఐతే తన కోసం అతను మూడేళ్లు ఓపిగ్గా ఎదురు చూసి.. తన మూడో సినిమాగానే ‘మిస్టర్ మజ్ను’ చేయడం గొప్ప విషయమని అన్నాడు.

కానీ దర్శకుడిగా వెంకీ ప్రతిభను సన్నిహితులు సైతం గుర్తించలేదని అంటారు. ‘తొలి ప్రేమ’ చూశాకే అందరికీ అతడి టాలెంట్ తెలిసింది. అలాంటిది అఖిల్ ముందే వెంకీ టాలెంట్ పసిగట్టి.. తన మూడో సినిమాను అతడితో చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు అంటే అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి ‘హలో’ తర్వాత ఆది పినిశెట్టి అన్నయ్యతో సినిమా చేయడానికి ఆల్మోస్ట్ రెడీ అయిన అఖిల్.. ‘తొలి ప్రేమ’ రిలీజయ్యాక ఆలోచన మార్చుకుని వెంకీతో సినిమా చేయడానికి ప్లాన్ మార్చుకున్న సంగతి అందరికీ తెలుసు. కానీ ‘మిస్టర్ మజ్ను’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం అఖిల్ కొత్త కథ వినిపించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English