ఒక అజ్ఞాతవాసి.. ఒక స్పైడర్.. ఒక యన్.టి.ఆర్

ఒక అజ్ఞాతవాసి.. ఒక స్పైడర్.. ఒక యన్.టి.ఆర్

పుంజుకుంటుంది.. పుంజుకుంటుంది అని ఎదురు చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన ‘యన్.టి.ఆర్’ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలబడింది. పండగ రోజుల్లో వసూళ్లు కొంచెం పర్వాలేదు కానీ.. అవి ఎంతమాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.20 కోట్ల షేర్ మార్కు దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ సినిమాకు మొదట్నుంచి చేసిన ప్రచార హడావుడి వల్లో.. ఇంకే కారణాల వల్లో కానీ.. బయ్యర్లలో ఎక్కడలేని ఆసక్తి కనిపించడంతో ఏకంగా రూ.71 కోట్లకు ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు అమ్మారు. సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే.. సినిమా పెట్టుబడిని వెనక్కి తెస్తుందనే అనుకున్నారు. కానీ తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘యన్.టి.ఆర్’.. రెండో రోజు దబేల్‌మని కింద పడింది.

ఇక ఆ తర్వాత లేవనేలేదు. వసూళ్లు లేక స్క్రీన్లు తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తగా.. ఉన్న స్క్రీన్లలో పండుగ రోజుల్లో కూడా హౌస్ ఫుల్స్ పడకపోవడంతో షేర్ నామమాత్రంగా వచ్చింది. ఇక ఈ వీకెండ్ తర్వాత అయితే సినిమా ఎక్కడా థియేటర్లలో నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. నికరంగా బయ్యర్లకు రూ.50 కోట్ల నష్టం తప్పదని తేలిపోయింది. ఇప్పటిదాకా టాలీవుడ్లో అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన సినిమా అంటే ‘అజ్ఞాతవాసి’నే. రూ.60 కోట్ల దాకా బయ్యర్లను ముంచిందా సినిమా. ‘స్పైడర్’ సినిమా కూడా దానికి చేరువగా వెళ్లింది. రూ.55 కోట్ల దాకా నష్టాలు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ‘యన్..టిఆర్’ రూ.50 కోట్ల నష్టాలతో ఆల్ టైం డిజాస్టర్లలో మూడో స్థానానికి స్థిరపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ పరిస్థితి ఏమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English