పేట నిర్మాతలు గొడవ రాజేస్తున్నారే..

పేట నిర్మాతలు గొడవ రాజేస్తున్నారే..

మన దగ్గరే కాదు.. కోలీవుడ్లోనూ స్టార్ హీరోల సినిమాల కలెక్షన్ల విషయంలో వివాదాలు మామూలే. ప్రధానంగా సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆయన తర్వాతి తరం స్టార్లు విజయ్, అజిత్ సినిమాలు వచ్చినపుడు కలెక్షన్ల విషయంలో విపరీతమైన గందరగోళం నడుస్తుంటుంది. నిర్మాతలు ప్రకటించే కలెక్షన్ల లెక్కలు ఒకలా ఉంటాయి.

ట్రేడ్ అనలిస్టులు, బాక్సాఫీస్ వెబ్ సైట్ల లెక్కలు మరోలా ఉంటాయి. పీఆర్వోలు.. అభిమానులు ప్రకటించే కలెక్షన్లు ఇంకోలా ఉంటాయి. వీటిలో ఏవి సరైనవో తెలియక గందరగోళం నెలకొంటూ ఉంటుంది. ఆ మధ్య అజిత్ సినిమా ‘వేదాలం’ కలెక్షన్లను మరీ ఎక్కువ చేసి చూపిస్తుంటే స్వయంగా నిర్మాత ఎ.ఎం.రత్నం దానికి యాంటీగా మాట్లాడాడు. ఈ అభిమానులకు, హీరోల మద్దతుదారులకు బాక్సాఫీస్ గురించి అవగాహనే ఉండదన్నట్లుగా మాట్లాడాడు. అయినప్పటికీ ఈ కలెక్షన్ల గురించి హైప్ ఆగట్లేదు.

తాజాగా సంక్రాంతికి తమిళనాట రజనీకాంత్ సినిమా ‘పేట’తో పాటు అజిత్ మూవీ ‘వేదాలం’ విడుదలయ్యాయి. వీటిలో తమిళనాడు వరకు అజిత్ సినిమాదే ఆధిపత్యం అని.. అక్కడ దానికే ఎక్కువ వసూళ్లు వచ్చాయని.. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు సాధించిందని వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ సినిమా కంటే అజిత్ చిత్రానికి ఎక్కువ వసూళ్లు రావడమేంటంటూ ఆయన అభిమానులు మండిపడ్డారు. దీనిపై అజిత్ అభిమానులతో సోషల్ మీడియాలో వారికి వార్ నడిచింది.

మరోవైపు రజనీ అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో సన్ పిక్చర్స్ కూడా ఈ విషయంలో సన్ పిక్చర్స్ జోక్యం చేసుకుంది. ‘పేట’ తమిళనాడులో 600కు పైగా థియేటర్లలో రిలీజైందని..  తమకే కలెక్షన్ల గురించి సరైన సమాచారం లేదని.. మరి బాక్సాఫీస్ ట్రాకర్స్ ఎలా వసూళ్లు ప్రకటిస్తారో అర్థం కావడం లేదని నిన్నో ట్వీట్ వచ్చింది ‘సన్ పిక్చర్స్’ ట్విట్టర్ అకౌంట్ నుంచి.

తర్వాత లేటెస్టుగా ‘పేట’ విడుదలైన 11వ రోజు కేవలం తమిళనాడు వరకే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించనుందని.. రాష్ట్రంలో ఇదే అత్యంత వేగంగా వంద కోట్ల గ్రాస్ సాధించిన చిత్రం ఇదే అని ప్రకటించింది. ఐతే గత కొన్నేళ్లలో విజయ్, అజిత్ సినిమాలు ప్రతిదీ వంద కోట్ల క్లబ్బులో చేరినట్లుగా వార్తలొచ్చాయి. అవి వీకెండ్లోనే ఆ మార్కును అందుకున్నట్లు, తమిళనాడులో కూడా వారం తిరక్కముందే వంద కోట్లు కలెక్ట్ చేసినట్లు కూడా ఘనంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు చూస్తే ఏమో ‘పేట’ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ అని.. అది కూడా 11వ రోజుకు ఈ ఘనత సాధించిందని సన్ పిక్చర్స్ ప్రకటించడం ద్వారా మిగతా సినిమాల రికార్డులన్నీ ఫేక్ అని చెప్పకనే చెప్పినట్లుంది. దీనిపై ఇప్పుడు కోలీవుడ్లో వివాదం రాజుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English