ఎన్టీఆర్.. మళ్లీ అదే షాక్?

టీవీ హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చినంత మంచి పేరు తెలుగులో ఇంకెవరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. తారక్ వాక్చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. అతడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది. ప్రతి విషయాన్నీ చక్కగా అర్థం చేసుకుని, జ్ఞాపకం ఉంచుకుని, చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, సూటిగా చెప్పడంలో అతడి నైపుణ్యమే వేరు.

ఈ లక్షణాలే అతణ్ని సూపర్ హోస్ట్‌గా మార్చాయి. తొలిసారిగా ‘బిగ్ బాస్’ షో కోసం అతను హోస్ట్ అవతారం ఎత్తాడు. అరంగేట్ర ఎపిసోడ్ నుంచే తనకు తిరుగులేదని చాటి చెప్పాడు. ప్రతి ఎపిసోడ్‌కూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తెలుగులో ఎన్నో సందేహాల మధ్య మొదలైన ‘బిగ్ బాస్’ సూపర్ హిట్ కావడంలో తారక్ పాత్ర ఎంతో కీలకం. ఐతే రెండో సీజన్ నుంచి ఈ షో నుంచి తప్పుకుని అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు తారక్. మళ్లీ అతను బిగ్ బాస్‌లోకి వస్తాడని ఆశగా చూసి చూసి అలసిపోయారు అభిమానులు.

‘బిగ్ బాస్’లోకి తారక్ తిరిగి రాడని తేలిపోయాక.. ఈ ఏడాది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కోసం ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్ అవతారం ఎత్తడం అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం తెచ్చిపెట్టింది. అంచనాలకు తగ్గట్లే ఈ షోలోనూ తారక్ తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు. షోను విజయవంతం చేశాడు. ఒక దశలో రేటింగ్స్ పడిపోయి ఆగిపోయిన ఈ షోకు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చిన ఘనత తారక్‌దే.

ఐతే ఈ నందమూరి హీరోనూ ఇకపై ఏటా కొన్ని రోజులు ‘ఈఎంకే’లో చూస్తామని ఆశించిన అభిమానులకు షాక్ తగలబోతోందని ప్రచారం జరుగుతోంది. తాజాగా తొలి సీజన్‌ షూటింగ్ పూర్తి చేసిన తారక్.. వచ్చే ఏడాది నుంచి ఈ షోలో కనిపించడని అంటున్నారు. ‘బిగ్ బాస్’లో మాదిరే ఇందులోనూ ఒక సీజన్‌తోనే తారక్ కథ ముగుస్తోందట. ఐతే ‘బిగ్ బాస్’ షోకు సహజంగా ఉన్న ఆకర్షణ వల్ల హోస్ట్ మారినా మరీ ఇబ్బందేమీ లేకపోయింది.

కానీ ‘ఈఎంకే’ దాంతో పోలిస్తే కొంచెం బోరింగే. ఇక్కడ హోస్ట్ చాలా కీలకం. ఆ విషయంలో గత సీజన్లలోనే రుజువైంది. ఆకర్షణ కోల్పోయిన ఈ షోకు మళ్లీ ఊపు తీసుకొచ్చిన తారక్.. తన మెరుపుల్ని ఒక్క సీజన్‌కు పరిమితం చేసి వెళ్లిపోయాడంటే మళ్లీ కథ పునరావృతం కావడం, షోకు ఆకర్షణ తగ్గి మరుగున పడిపోవడం ఖాయం. మరి వచ్చే సీజన్లో ఏమవుతుందో చూడాలి.