బలమైనోళ్లను బలహీనులుగా చేయటంలో కేసీఆర్ ఫార్ములా అదుర్సు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తులు అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ఉంటాయి. తనకు రాజకీయ ప్రత్యర్థులుగా మారే అవకాశం ఉన్న వారిని.. ఏ మాత్రం ఉపేక్షించకుండా తన జట్టులోకి తీసుకోవటం ద్వారా వారిని నిర్వీర్యం చేయటం.. గొంతు విప్పకుండా ఉంచటం లాంటివి చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత.. ఆయన కొన్ని పార్టీలకు చెందిన బలమైన నేపథ్యం ఉన్న నేతల్ని ఒకరి తర్వాత ఒకరు చొప్పున పార్టీలోకి చేర్చుకోవటం కనిపిస్తుంది.

అయితే.. ఇలా చేర్చుకున్న వారిలో అత్యధికులు ఆయన్ను బండ బూతులు తిట్టిన వారే. ఆయన కంటే ఎంతో సీనియర్లు. విచిత్రమైన విషయం ఏమంటే.. వారందరిని ప్రేమగా దగ్గరకు తీసుకొని.. కొంతకాలం ప్రాధాన్యతను ఇచ్చి.. ఆ తర్వాత వారిని పట్టించుకోకుండా ఉండటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుంది. తుమ్మల నాగేశ్వరావు సంగతే తీసుకోండి. ఆయన లాంటి నేత పార్టీలోకి చేరటమే గొప్పన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన కేసీఆర్.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వటం.. ఆయన్ను పార్టీలో ప్రత్యేకంగా చూడటం తెలిసిందే.

కాల ప్రవాహంలో ఇప్పుడు తుమ్మల ఎక్కడ ఉన్నాడని భూతద్దం వేసుకొని వెతికే పరిస్థితి. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి విషయానికే వస్తే.. మొదటి టర్మ్ లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటమే కాదు.. సీనియర్ నేతగా ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. టీఆర్ఎస్ లో ఏళ్లకు ఏళ్లు ఉన్న నేతలకు దక్కని గౌరవాన్ని కడియంకు ఇచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత ఆయన్ను ఏం చేశారో తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎంతోమంది సీనియర్లను.. బలమైన గొంతుక ఉన్న తెలంగాణ నేతల్ని తన పార్టీలో వ్యూహాత్మకంగా చేర్చుకోవటం.. వారికి కొంతకాలం అధిక ప్రాధాన్యత ఇవ్వటం.. ఆ తర్వాత వారు నోరు విప్పలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లటంలో ఆయన ప్రావీణ్యం మరెవరికీ రాదనే చెప్పాలి.

కొద్ది నెలల క్రితమే టీటీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎల్ రమణను పార్టీలో చేర్చుకున్న వేళలో.. కేసీఆర్ నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వచ్చాయో గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. ఆయన్ను రాష్ట్రస్థాయిలో వాడుకుంటామని.. కీలక బాధ్యత అప్పజెబుతామని చెప్పారే కానీ.. మళ్లీ ఎల్. రమణ కనిపించని పరిస్థితి. తాజాగా మోత్కు పల్లి చేరిక వేళలోనే కేసీఆర్ నోటి నుంచి అవే మాటలు వచ్చాయి. మరి.. ఆయన్ను ఏం చేస్తారో చూడాలి.