బండ్ల గ‌ణేష్ బాంబులెవ‌రిపై?

Bandla Ganesh

‘‘సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ సహనం, ఓర్పు ఎదురు తిరిగితే ప్రళయం పుడుతుంది’’.. ఇదీ బండ్ల గణేష్ ఆదివారం ట్విట్టర్లో పెట్టిన ఒక పోస్టు. ఎవరిని ఉద్దేశించి గణేష్ ఈ పోస్టు పెట్టాడన్న దానిపై నెటిజన్లలో పెద్ద చర్చే నడిచింది.

ఈ పోస్టు కచ్చితంగా చిరంజీవిని దృష్టిలో ఉంచుకునే పెట్టి ఉండచర్చనే అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తమయ్యాయి. ఈ బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు ఎంత పెద్ద అభిమానో తెలిసిందే.

ఒకప్పుడైతే ఎక్కువగా పవన్నామ స్మరణే చేసేవాడు కానీ.. కొన్ని నెలల కిందట రెండోసారి కరోనా బారిన పడి ఎక్కడా ఆసుపత్రుల్లో బెడ్ దొరకని పరిస్థితుల్లో చిరంజీవి చొరవ తీసుకుని అపోలోలో చేర్పించడం.. తన ప్రాణాలు కాపాడటంతో మెగాస్టార్ మీద అభిమానం ఎన్నో రెట్లు పెరిగిపోయింది గణేష్‌కు.

‘మా’ ఎన్నికల సందర్భంగా ఒక టీవీ చర్చలో ఇండస్ట్రీకి కొత్త పెద్ద అవసరమా అని అడిగితే.. చిరంజీవి ఉండగా, ఇన్నిన్ని మంచి పనులు చేస్తుండగా ఇంకెవరూ అవసరం లేదని కుండబద్దలు కొట్టాడు బండ్ల. ఐతే మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన నేపథ్యంలో నరేష్, మోహన్ బాబు లాంటి వాళ్లు చిరంజీవిని టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ ఈ పోస్ట్ పెట్టినట్లుగా భావిస్తున్నారు. దీని కంటే ముందు ‘‘Postponment is not punishment its an achievement now a days’’ అంటూ ఇంకో పోస్ట్ పెట్టి అందరినీ అయోమయానికి గురి చేశాడు గణేష్. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. ఇది ఫోన్ ద్వారా తనకు షేర్ చేసిన కోట్ మాత్రమే అని.. అంతా బాగానే ఉందని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాసేపటికే ‘‘సహనం.. ఓర్పు ఎదురు తిరిగితే ప్రళయం పుడుతుంది’’ అంటూ పైన పేర్కొన్న ట్వీట్ వేసి చిరును టార్గెట్ చేస్తున్న వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు కనిపించాడు బండ్ల.