చిరంజీవి గురించి సేతుపతి ఏమన్నాడంటే..

చిరంజీవి గురించి సేతుపతి ఏమన్నాడంటే..

తమిళంలో చిన్న స్థాయి పాత్రలతో మొదలుపెట్టి నటుడిగా గొప్ప స్థాయికి చేరిన వ్యక్తి విజయ్ సేతుపతి. మొదట్లో అతను నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ‘పిజ్జా’ సినిమాతో అతను కథానాయకుడిగా మారాడు. అది కూడా డైరెక్టర్స్ మూవీగానే పేరు తెచ్చుకుంది కానీ.. నటుడిగా విజయ్ సేతుపతి దశ ఒక్కసారిగా ఏమీ తిరిగిపోలేదు. ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న అవకాశాల్నే సద్వినియోగం చేసుకున్నాడు. దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయే నటనతో గొప్ప పేరు సంపాదించాడు. ప్రధానంగా చేసింది తమిళ సినిమాలే కానీ.. విజయ్ సేతుపతి ఎంత గొప్ప నటుడో మన వాళ్లను అడిగినా చెబుతారు. డబ్బింగ్ సినిమాలు.. డైరెక్ట్ తమిళ సినిమాల్లో విజయ్ నటన చూసి లక్షలాది మంది తెలుగు వాళ్లు కూడా అతడికి అభిమానులుగా మారిపోయారు.

ఇలాంటి గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర చేస్తుండటం మనవాళ్లను ఎగ్జైట్ చేస్తోంది. నిన్న విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతడి లుక్ లాంచ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తన బర్త్ డే సందర్భంగా విజయ్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ‘సైరా’ ప్రస్తావన వచ్చింది. అప్పుడు చిరంజీవి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు విజయ్.

రజనీకాంత్.. మణిరత్నం.. చిరంజీవి.. ఇలాంటి వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో యూనివర్శిటీ లాంటి వాళ్లని.. ఇలాంటి వాళ్లను జీవితంలో ఒకసారైనా కలుస్తానని.. వాళ్లతో కలిసి సినిమాలు చేస్తానని తాను ఎన్నడూ ఊహించలేదని.. వాళ్లంటేనే తనకు చాలా భయం అని విజయ్ చెప్పాడు. అలాంటి వాళ్లతో తన లాంటి సామాన్యుడు కలిసి సినిమాలు చేయడం అన్నది ఊహకందని విషయమని.. చాలా భయపడుతూనే వీళ్లతో సినిమాలు చేస్తున్నానని అన్నాడు. చిరంజీవితో సార్‌తో పని చేయడం ప్రతి రోజూ ఒక గొప్ప అనుభవమని.. ఇది తన అదృష్టమని అతను చెప్పాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విజయ్ సేతుపతి ఈ ఇంటర్వ్యూలో చిరు సహా అందరి గురించి చెప్పిన మాటలు జనాల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English