ఈగ విలన్.. ఇరగ్గొట్టాడుగా

ఈగ విలన్.. ఇరగ్గొట్టాడుగా

కన్నడలో చిన్న స్థాయి నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టి పెద్ద స్టార్‌గా ఎదిగిన హీరో కిచ్చా సుదీప్. అతడి టాలెంట్ ఏంటో ‘ఈగ’ సినిమాలో తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. దానికి ముందు.. తర్వాత కన్నడలో సుదీప్ భారీ విజయాలందుకున్నాడు. తాజాగా అతను కెరీర్లో ఎన్నడూ చేయని ఒక సాహసం చేశాడు. ఎంతో కష్టపడి బాక్సర్ పాత్ర కోసం పూర్తిగా అవతారం మార్చుకుని కళ్లు చెదిరే రీతిలో మేకోవర్ అయ్యాడు. ఈ కష్టమంతా ‘పయిల్వాన్’ సినిమా కోసమే.

తాజాగా విడుదలైన ‘పయిల్వాన్’ టీజర్లో సుదీప్ లుక్.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనాలు షాకవుతున్నారు. బాలీవుడ్ హీరోలు ఇలాంటి మేకోవర్లు సాధించడం మామూలే. దక్షిణాదిన మాత్రం సుదీప్ స్థాయిలో బాడీని మలుచుకున్న వాళ్లు అరుదుగానే కనిపిస్తారు. రెజ్లర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో బాక్సింగ్‌లోకి వెళ్లే యోధుడి పాత్రలో కనిపించనున్నాడు సుదీప్. కృష్ణుడు, కంసుడు ఇద్దరూ మల్ల యోధులే అని.. కాకపోతే ఒకరు ధర్మం కోసం.. ఇంకొకరు అధర్మం కోసం పోరాడారని సుదీప్ వాయిస్‌తో వచ్చే నరేషన్‌తో ఈ టీజర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అంతా సుదీప్ విన్యాసాలే కనిపించాయి. టీజర్‌కు అతనే హైలైట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ టీజర్లోని విజువల్స్ చూస్తే ఇది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సుల్తాన్’కు రీమేక్ అని జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తోంది. దాదాపుగా అందులోని షాట్సే ఇందులోనూ కనిపిస్తున్నాయి. కానీ టీజర్ ఆరంభంలో ఇచ్చిన వాయిస్ ఓవర్ చూస్తే ఈ కథ వేరేమో అనిపిస్తోంది. కథ ఏదైనప్పటికీ మంచి పెర్ఫామర్ అయిన సుదీప్‌ను ఇలా రెజ్లర్‌గా, బాక్సర్‌గా చూడటం అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English