మన సినిమా.. హిందీ డిజాస్టర్.. మలయాళంలో హిట్

మన సినిమా.. హిందీ డిజాస్టర్.. మలయాళంలో హిట్

ఒక భాషలో పెద్ద హిట్టయిన సినిమా ఇంకో భాషలోనూ ఆడేస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. అందుకు గత కొన్నేళ్లలో చాలా రుజువులు కనిపిస్తాయి. ఒకప్పుడు రీమేక్ సినిమాల సక్సెస్ రేట్ బాగానే ఉండేది కానీ.. తర్వాత తర్వాత అది బాగా పడిపోయింది. ఒక భాషలో ఒక సినిమా హిట్టవ్వగానే దాని విశేషాలన్నీ బయటికి వచ్చేస్తుండటంతో రీమేక్ సినిమాలపై జనాలకు పెద్దగా ఆసక్తి ఉండట్లేదు. అయినప్పటికీ రీమేక్‌లేమీ ఆగట్లేదు. పరాజయాలూ తప్పట్లేదు.

రెండున్నరేళ్ల కిందట తెలుగులో ‘పెళ్లిచూపులు’ అనే చిన్న సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంతో దర్శకుడు తరుణ్ భాస్కర్.. హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రీతూ వర్మ.. కమెడియన్ ప్రియ దర్శిల కెరీర్లే మారిపోయాయి. టాలీవుడ్లో ఇదొక ట్రెండ్ సెట్టర్ లాగా నిలిచింది. కొత్త తరహా సినిమాలకు మంచి ఊపునిచ్చింది. ఐతే ఇక్కడ ఇంత మంచి ఫలితం అందుకున్న ‘పెళ్లిచూపులు’ను హిందీలో ‘మిత్రో’ పేరుతో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయింది. వీకెండ్లోనే సినిమా అడ్రస్ లేకుండా పోయింది.

ఐతే ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లోనూ రీమేక్ చేయడానికి అప్పటికే సన్నాహాలు జరిగిపోయాయి. కొన్ని కారణాల వల్ల తమిళ వెర్షన్ ఆగిపోయింది కానీ.. మలయాళంలో మాత్రం చిత్రీకరణ పూర్తి చేశారు. ‘విజయ్ సూపరుమ్ పౌర్నమియుమ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవలే రిలీజ్ చేశారు. అక్కడ ఈ చిత్రానికి మంచి రివ్యూలొచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. కేరళ వ్యాప్తంగా ‘పెళ్లిచూపులు’ రీమేక్ చాలా బాగా ఆడుతోంది. జిస్ జాయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అసిఫ్ అలీ, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English