బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ సినిమా అట..

బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ సినిమా అట..

తాను రాసిన.. తాను సెట్ చేసిన.. తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాల గురించి ఎక్కడ లేని గొప్పలు చెప్పుకోవడం కోన వెంకట్‌కు అలవాటు. ఒకప్పుడు రచయితగా వైభవం చూసిన ఆయన.. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్లతో ప్రేక్షకుల నమ్మకం కోల్పోయాడు. ఐతే రచయితగా పదును కోల్పోతున్న సమయంలోనే నిర్మాత అవతారం ఎత్తి ఇండస్ట్రీలో తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు కోన. పూర్తిగా తనే పెట్టుబడి పెట్టకపోయినా.. నిర్మాతను వెతికి క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసి సినిమాలు పట్టాలెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడిగా మారాడు. ఈ కోవలోనే కోన సమర్పణలో గీతాంజలి, త్రిపుర, అభినేత్రి, నిన్ను కోరి లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడాయన సైలెన్స్ అనే వెరైటీ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. చాలా ఏళ్ల కిందట మంచు విష్ణు హీరోగా వచ్చిన వస్తాడు నా రాజుతో దర్శకుడిగా పరిచయం అయిన హేమంత్ మధుకర్ చాలా గ్యాప్ తర్వాత రూపొందించబోయే చిత్రమిది.


సైలెన్స్‌ను సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ ఫిలింగా చెబుతున్నాడు కోన వెంకట్. ఈ చిత్రంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పేరున్న నటీనటులతో పాటుగా ఓ హాలీవుడ్ నటుడిని కూడా నటింపజేస్తుండటం వల్ల దీన్ని ఇలా అభివర్ణిస్తున్నాడాయన. తెలుగు-తమిళం-హిందీ భాషల ప్రేక్షకులకు పరిచయం ఉన్న అనుష్క, మాధవన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు అంజలి, షాలిని పాండేలకు కూడా సైలెన్స్‌లో కీలక పాత్రలు దక్కాయి. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు, కిల్ బిల్ ఫేమ్ మైకేల్ మాడ్సన్ కూడా నటిస్తున్నాడన్న వార్త ఇటీవలే బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి కాస్టింగ్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. మార్చిలో ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లిష్‌లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English