నాని గానీ సిక్సర్ కొట్టాడంటే..

నాని గానీ సిక్సర్ కొట్టాడంటే..

ఇండియాలో కొన్ని జానర్లు టచ్ చేయడానికి రీజనల్ డైరెక్టర్లు సాహసం చేయరు. అందులో స్పోర్ట్స్ డ్రామా ఒకటి. ముఖ్యంగా తెలుగులో అథెంటిక్ స్పోర్ట్స్ డ్రామాలు చాలా చాలా తక్కువ. సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో క్రీడల నేపథ్యంలో అథెంటిగ్గా.. రియలిస్టిగ్గా తీసిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టేవిగా ఉంటాయి. 90ల్లో అశ్విని నాచప్ప ప్రధాన పాత్రలో ఆమె కథనే సినిమాగా తీశారు. అది పర్వాలేదనిపించింది తప్ప ప్రేక్షకుల్ని ఎమోషనల్‌గా ఏమీ కదిలించేయలేదు.

ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ 'గోల్కొండ హైస్కూల్' సినిమాను ఉన్నంతలో బాగానే తీశాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం పరిధిలో జరిగే స్కూల్ క్రికెట్‌‌ను చక్కగా అధ్యయనం చేసి రియలిస్టిగ్గా.. ఇన్‌స్పైరింగ్‌గా సినిమాను తీర్చిదిద్దాడు. ఐతే పేరున్న నటీనటులు లేకపోవడం వల్ల సినిమా అనుకున్న స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాలేదు.

ఇక విక్టరీ వెంకటేష్ నటించిన 'గురు' మంచి స్పోర్ట్స్ డ్రామానే. కాకపోతే అది తమిళ సినిమాకు రీమేక్. తెలుగులో పేరున్న హీరో నటించి.. కొంచెం పెద్ద స్థాయిలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా అంటే 'జెర్సీ'నే. సంక్రాంతి కానుకగా శనివారం రిలీజైన ఈ చిత్ర టీజర్ చూసిన వాళ్లకు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లేటు వయసులో తన ప్రతిభను రుజువు చేసుకోవాలని తపించే ఒక రంజీ స్థాయి క్రికెటర్ జీవితాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. టీజర్లో ప్రతి షాట్ ఆసక్తికరంగా కనిపించింది.

క్రికెటర్ల జీవితాన్ని.. క్రికెట్ వ్యవస్థను లోతుగా అధ్యయనం చేసి సినిమా రూపొందించినట్లున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. టీజర్లోని డైలాగ్ లాగా ఈ సినిమాతో నాని సిక్సర్ కొడతాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. టీజర్ ఉన్న స్థాయిలో సినిమా ఉంటే ఇది ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయే అవకాశముంది. నాని లాంటి మంచి నటుడు దొరకడం గౌతమ్ అదృష్టమే. మరి ఈ అవకాశాన్ని అతనెంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English