కంచరపాలెం కథ భలే మలుపు తిరిగిందే

కంచరపాలెం కథ భలే మలుపు తిరిగిందే

నిర్మాత ఎన్నారై అన్న కారణం చూపి ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను జాతీయ అవార్డులకు పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్ర నిర్మాత పరుచూరి ప్రవీణ స్వతహాగా భారతీయురాలే. కానీ అమెరికాలో స్థిరపడింది. ఆమె అక్కడి నుంచి వచ్చి పూర్తిగా ఇక్కడి నటీనటులు.. సాంకేతిక నిపుణులతో సినిమాను నిర్మించింది. నిర్మాత ఎన్నారై అనే ఒక్క కారణం చూపించి జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిరాకరించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడించింది.

నిర్మాత ప్రవీణ కూడా సైలెంటుగా ఉండకుండా ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లింది. ఆయన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌లను ట్యాగ్ చేస్తూ సమస్యను వివరించాడు. ఆశ్చర్యకరంగా కాసేపటికే సమస్య పరిష్కారం అయింది. రాథోడ్ కార్యాలయానికి చెందిన అధికారి.. ప్రవీణకు ఫోన్ చేయడం, జాతీయ అవార్డులకు ‘కేరాఫ్ కంచెరపాలెం’ పోటీ పడేందుకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడం చకచకా జరిగిపోయాయి. రాథోడ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలియజేశాడు. కేరాఫ్ కంచెరపాలెం సినిమాను ఐఎఫ్ఎఫ్ఐ అవార్డులకూ కూడా పంపొచ్చని ఆయన వెల్లడించారు. దీంతో ప్రవీణ ఆనందానికి అవధుల్లేవు. తమ సినిమా జాతీయ అవార్డులకు వెళ్తోందంటూ అమితమైన ఆనందంతో ప్రకటించిన ప్రవీణ.. కేటీఆర్‌తో పాటు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌లకు ధన్యవాదాలు చెప్పింది. ఈ విషయంలో కేటీఆర్, రాథోడ్‌లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English