డబ్బింగ్ సినిమా మళ్లీ లేచింది

డబ్బింగ్ సినిమా మళ్లీ లేచింది

దాదాపు మూడేళ్ల కిందట ‘బిచ్చగాడు’ అనే తమిళ డబ్బింగ్ సినిమా ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఆ చిత్రం.. ‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ సినిమాను కూడా దెబ్బ కొట్టింది. మహేష్ బాబు సినిమాను తీసేసి ‘బిచ్చగాడు’ను రీప్లేస్ చేశారు చాలా థియేటర్లలో.

ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమా విషయంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడు వారాల కిందట పెద్దగా అంచనాల్లేకుండా రిలీజైన కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ మంచి టాక్ తెచ్చుకుని తర్వాత ఎలా వసూళ్ల వర్షం కురిపించిందో తెలిసిందే. మిగతా క్రిస్మస్ సినిమాలు.. తర్వాతి వారంలో వచ్చిన చిత్రాలు తుస్సుమనిపించగా.. ‘కేజీఎఫ్’ మాత్రం అదరగొడుతూ సాగిపోయింది. ఐతే సంక్రాంతి సినిమాల రాకతో ఈ సినిమా కథ ముగిసినట్లే కనిపించింది.

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ రిలీజ్ రోజే దీన్ని చాలా చోట్ల లేపేశారు. తర్వాతి రోజు ‘పేట’.. శుక్రవారం ‘వినయ విధేయ రామ’ విడుదల కావడంతో ‘కేజీఎఫ్’ అడ్రస్ దాదాపు గల్లంతయినట్లే కనిపించింది. బుక్ మై షోలో దీని షోలు నామమాత్రంగా కనిపించాయి. కానీ శనివారానికి మాత్రం కేజీఎఫ్ షోలు పెంచేశారు. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’కు టాక్ బాగున్నా వసూళ్లు పేలవంగా ఉన్నాయి. చాలా చోట్ల దానికి స్క్రీన్లు తగ్గించేశారు. మల్టీప్లెక్సుల్లో షోలు తగ్గిపోయాయి. ‘పేట’కు కూడా డివైడ్ టాక్ ఉండగా.. ‘వినయ విధేయ రామ’కు పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది.

శనివారం అక్కడక్కడా సింగిల్ స్క్రీన్లను తీసి ‘కేజీఎఫ్’కు ఇస్తుండగా.. మల్టీప్లెక్సుల్లో మళ్లీ షోలు కేటాయిస్తున్నారు. శుక్రవారం ట్రెండ్స్ చూస్తే ‘కేజీఎఫ్’ మళ్లీ పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఉన్న థియేటర్లలో దీనికి వసూళ్లు బాగానే వచ్చాయి. మొత్తానికి కథ ముగిసిందనుకున్న సినిమా.. మళ్లీ పైకి లేచి సత్తా చాటడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English