చరణ్ బాలయ్యను తలపించిన వేళ..

చరణ్ బాలయ్యను తలపించిన వేళ..

‘లక్ష్మీనరసింహా’ హిట్ తర్వాత ఒక ఆరేడేళ్లు దారుణమైన సినిమాలు వచ్చాయి నందమూరి బాలకృష్ణ నుంచి. ‘పలనాటి బ్రహ్మనాయుడు’.. ‘విజయేంద్ర వర్మ’ లాంటి కొన్ని సినిమాలు బాలయ్యను కామెడీ పీస్‌గా మార్చేశాయి. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాలో తొడగొట్టి ట్రైన్‌ను వెనక్కి పంపించేసే సన్నివేశంతో నందమూరి బాలకృష్ణ ఏ స్థాయిలో ట్రోల్ అయ్యాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ‘విజయేంద్ర వర్మ’లో మోటార్ సైకిల్ వేసుకుని నేరుగా ట్రైన్ మీదికి వెళ్లిపోయే సీన్ కూడా ఈ కోవలోనిదే. ఇలాంటి సీన్లన్నీ ఒకచోటికి చేర్చి వీడియోలు రూపొందించి బాలయ్యను ఓ రేంజిలో ట్రోల్ చేశారు జనాలు. యూట్యూబ్ వాడకం పెరుగుతున్న క్రమంలో ఈ తరహా బాలయ్య వీడియోలు జనాలకు వినోదం పంచాయి.

ఐతే అప్పటి సినిమాలు వేరు. ట్రెండ్ వేరు. కాబట్టి బాలయ్య తెలియక ఇలాంటి విన్యాసాలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటి రోజులు వేరు. ఏ చిన్న తేడా జరిగినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజిలో ఉంటోంది. అందులోనూ బాలయ్యకు ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని మిగతా హీరోలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. ఐతే ఇలాంటి టైంలో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో చేసిన విన్యాసాలు చూసి జనాలు విస్తుబోతున్నారు. ఇందులో ఒక సీన్లో హీరో అన్నయ్య బీహార్లో విలన్ దగ్గర చిక్కుకుని హీరోకు ఫోన్ చేస్తాడు. అప్పుడతను ఎయిర్ పోర్టులో ఉంటాడు. అన్నయ్య ఫోన్ రావడం ఆలస్యం ఎయిర్ పోర్టు అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకుతాడు. తర్వాత ఒక బ్రిడ్జ్ మీది నుంచి ట్రైన్ మీదికి దూకి.. బీహార్‌కు వెళ్లిపోతాడు. ఈ సీన్ చూసి జనాలు థియేటర్లలో హాహాకారాలు చేస్తున్నారు. బాలయ్యకు చరణ్ ఏమీ తక్కువ కాదని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలోని మరో సీన్లో హీరో రౌడీల తలలు నరికితే.. అవి గాల్లో ఎగురుతుండగా గద్దలొచ్చి ముక్కున కరుచుకుని వెళ్లిపోయే సన్నివేశం కూడా జనాల మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటి సీన్లు బోయపాటి ఎలా తీశాడో.. చరణ్ ఎలా ఒప్పుకున్నాడో అన్నది అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English