అక్కినేని కుటుంబంలో బయోపిక్ ఆశ?

అక్కినేని కుటుంబంలో బయోపిక్ ఆశ?

‘మహానటి’ సినిమాతో తెలుగు సినిమాల్లో బయోపిక్‌లకు ఎక్కడ లేని ఊపు వచ్చింది. అప్పటిదాకా బయోపిక్‌ల మీద అటు ఫిలిం మేకర్లలో కానీ.. ఇటు ప్రేక్షకుల్లో కానీ అంత సానుకూల అభిప్రాయం ఏమీ లేదు. అసలు సావిత్రి జీవిత కథతో సినిమా తీస్తున్నారనగానే పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. ఆమె కథను చూడాలన్న ఆసక్తి ఎవరికి ఉంటుంది అన్నారు. కానీ నాగ్ అశ్విన్ టీం వెండితెరపై సావిత్రి కథను ఆవిష్కరించిన తీరుకు ఫిదా అయిపోయారు. సావిత్రి గురించి తెలిసిన వాళ్లే కాదు.. తెలియని వాళ్లు కూడా ఈ సినిమా చూసి ఒక అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. సావిత్రికి కొత్తగా అభిమానగణాన్ని తెచ్చిపెట్టిన సినిమా ఇది. జనాలందరికీ ఆమె మీద ఒక గౌరవభావాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కించిన సినిమాకూ మంచి టాక్ వచ్చింది.

కమర్షియల్‌గా ‘యన్.టి.ఆర్’ ఏ స్థాయి విజయం సాధిస్తుందన్నది పక్కన పెడితే.. ఎన్టీఆర్ అభిమానులకిది మహదానందాన్ని కలిగించే సినిమా. ఆయనపై గౌరవాన్ని పెంచే చిత్రం. అప్పుడు ‘మహానటి’.. ఇప్పుడు ‘యన్.టి.ఆర్’ చూస్తుంటే తెలుగులో ఇలాంటి బయోపిక్స్ మరిన్ని వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. మిగతా దిగ్గజ నటీనటుల కుటుంబ సభ్యులకు తమ వారి బయోపిక్స్ కూడా ఇలాగే వెండి తెరపై చూసుకోవాలని.. జనాలకు చూపించాలని ఆశ పుడితే ఆశ్చర్యం లేదు. అలాంటి ఆలోచనే అక్కినేని వారి కుటుంబంలో పుట్టినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఏఎన్నార్ బయోపిక్ గురించి ఆ మధ్య చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఐతే నాగేశ్వరరావు జీవితంలో ఎత్తులే తప్ప పల్లాలు లేవని.. ఆయన మొదట్లో మినహాయిస్తే ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది పడలేదని.. సంపూర్ణ జీవితం అనుభవించారని.. డ్రామా లేని ఆయన జీవితాన్ని సినిమాగా ఏం తీస్తామని అన్నాడు నాగ్. కానీ ఈ మధ్య ఆయన ఆలోచన మారినట్లు చెబుతున్నారు. తాజాగా తిరుమలకు వచ్చిన నాగ్‌ను ఈ విషయమై అడిగితే.. ఇంతకుముందులా ఖండించేసి వెళ్లిపోలేదు. నవ్వి ఊరుకున్నాడు. సమాధానం చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అక్కినేని కుటుంబం కూడా బయోపిక్ దిశగా అడుగులేస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English