‘మహానటి’ తర్వాత మరో సాహసం

‘మహానటి’ తర్వాత మరో సాహసం

హిట్టయ్యే సినిమాలుంటాయి. బ్లాక్ బస్టర్లయ్యేవీ ఉంటాయి. మంచి పేరు తెచ్చి పెట్టే సినిమాలూ ఉంటాయి. కానీ గౌరవం తెచ్చే పెట్టే చిత్రాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. ‘మహానటి’ ఆ కోవలోని సినిమానే. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ గర్వంతో ఉప్పొంగిపోయారు విడుదల తర్వాత. ముఖ్యంగా ఇందులో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెను ప్రేక్షకులు చూసే కోణమే మారిపోయింది ఈ చిత్రంతో.
కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న కీర్తి ఒక నటి అలాంటి పాత్ర చేసి మెప్పించడం అంటే సాహసమే. కెరీర్లో అరుదుగా మాత్రమే ఇలాంటి సినిమాలొస్తుంటాయి. ‘మహానటి’ తర్వాత కీర్తిని ఇలాంటి ప్రత్యేకమైన, సాహసోపేత పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఐతే ఆమె ‘సర్కార్’.. ‘సామి-2’ లాంటి మామూలు సినిమాల్లో ఏ ప్రత్యేకత లేని పాత్రల్లో నటించి నిరాశ పరిచింది.

కానీ ఇప్పుడు కీర్తి మరో సాహసోపేత చిత్రానికి రెడీ అయింది. అది తెలుగు సినిమానే కావడం విశేషం. నరేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘నా నువ్వే’.. ‘118’ చిత్రాల్ని నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ కీర్తి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. గురువారం ఈ చిత్ర ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ హాజరై కీర్తిపై క్లాప్ కొట్టాడు. ‘మహానటి’ తర్వాత తెలుగులో వచ్చిన అవకాశాలేవీ అంగీకరించని కీర్తి.. ఏరి కోరి ఈ సినిమా ఓకే చేసిందంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English