అక్కడ ఎన్టీఆర్ లేడు.. ఇక్కడ బాలయ్య లేడు

అక్కడ ఎన్టీఆర్ లేడు.. ఇక్కడ బాలయ్య లేడు

‘మహానటి’ సినిమాలో సావిత్రితో కలిసి పని చేసిన ప్రముఖ నటీనటులు.. సాంకేతిక నిపుణులు చాలామంది కనిపిస్తారు. కానీ సావిత్రితో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన నందమూరి తారక రామారావు మాత్రం ఉండడు. ఆ పాత్రను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయించాలని అనుకుంది చిత్ర బృందం. కానీ అతను ఒప్పుకోకపోవడంతో ఆ పాత్రకు ఎవరినీ తీసుకోలేదు. ఐతే ఒక సీన్లో విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఎన్టీఆర్‌ను చూపిస్తారు. కానీ డైలాగ్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్ గురించి వేరే వాళ్లు గొప్పగా మాట్లాడుకునే సీన్ ఉంటుంది. అది ఆయన అభిమానులకు ఉత్సాహాన్నిస్తుంది. ఇప్పుడు ‘యన్.టి.ఆర్’ సినిమాలోనూ ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. బాలయ్యే ఎన్టీఆర్‌గా నటించిన ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర లేకపోవడం ఆశ్చర్యమే.

తనే ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ.. మళ్లీ తన క్యారెక్టర్ ప్రత్యేకంగా అవసరం లేదని భావించాడు బాలయ్య. హరికృష్ణ మిగతా కొడుకుల్లో తెరపై కనిపించేది ఒక్క హరికృష్ణ క్యారెక్టర్ మాత్రమే. బాలయ్యగా ఎవరినీ తీసుకోలేదు. చూపించలేదు. అలాగని ఇందులో ఆయన ప్రస్తావన లేకుండా ఉండదు. బాలయ్య కనిపించకపోయినా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే.. ‘జై బాలయ్యా’ అని నినాదాలు చేయించే సన్నివేశం ఒకటుంది. అది ఎన్టీఆర్ తన కొడుక్కి బాలకృష్ణ అని నామకరణం చేసే సన్నివేశం. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి విజయాన్నందుకున్న తరుణంలో బాలయ్య పుట్టినట్లుగా చూపించారు. ఆ పిల్లాడు మహర్జాతకుడని పంతులు చెబుతుంటే.. ఎన్టీఆర్ సైతం తన బిడ్డను పొగిడేస్తాడు. ఎంత వయసొచ్చినా యవ్వనంగా ఉంటాడని అంటూ బాలకృష్ణ అని పేరు పెడతాడు. ఈ సన్నివేశం మొదలయ్యేటపుడే అక్కడ బాలకృష్ణ ప్రస్తావన వస్తుందన్న విషయం అభిమానులకు అర్థమైపోతుంది. దీంతో థియేటర్లు జై బాలయ్యా నినాదాలతో హోరెత్తిపోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English