బాలయ్య.. ఎన్టీఆర్.. ఒక టపాకాయ

బాలయ్య.. ఎన్టీఆర్.. ఒక టపాకాయ

నందమూరి తారక రామారావు తన పిల్లల పెంపకం విషయంలో చాలా కఠినంగా ఉండేవారని అంటారు. తన పిల్లల్ని పాఠశాలల్లో ప్రత్యేకంగా చూడవద్దని టీచర్లకు చెప్పేవారని.. అలాగే వాళ్లు షూటింగ్‌లకు వచ్చినపుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది కాదని చెబుతారు. తన పిల్లల్ని సినిమాల్లో నటింపజేసేటపుడు కూడా ఎన్టీఆర్ కొంచెం కఠినంగా ఉండేవారని అంటారు. ఇదే విషయంలో బాలకృష్ణ దగ్గర ప్రస్తావిస్తే ఆ సంగతి నిజమే అంటూ.. తమతో ఎన్టీఆర్ ఎలా ఉండేవారో వివరించాడు.

తాను తన తండ్రితో కలిసి నటించిన ‘విశ్వామిత్ర’ చిత్రీకరణ సందర్భంగా టపాకాయ పేలి కాలికి గాయమైనా కూడా తన తండ్రి మామూలుగానే ఉన్నారని.. హడావుడి చేయలేదని.. తమను ఎప్పుడూ ఆయన గారాబం చేయలేదని బాలయ్య వెల్లడించాడు. ఈ ఉదంతం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలయ్య వివరించాడు.

‘‘నాన్న మమ్మల్ని ఎప్పుడూ గారాబం చేయలేదు. అలాగని ఆయన జీవితంలో పడ్డ కష్టాలన్నీ మా ముందు చెప్పుకుని బాధ పడిందీ లేదు. ఆయన దర్శకత్వంలో మేం నటిస్తున్నపుడు కూడా తన బిడ్డగా ప్రత్యేకంగా చూసేవారు కాదు. ‘విశ్వామిత్ర’ షూటింగ్ టైంలో కపాల మోక్షం పొందే నేపథ్యంలో సన్నివేశం తీస్తున్నారు. నా కాలి దగ్గర ఒక టపాకాయ పేలాలి. అది పేల లేదు. దీంతో ఇంకో టపాకాయ విసరమంటూ నాన్న ఆదేశించారు. అప్పుడు దాంతో పాటుగా అంతకుముందు విసిరింది కూడా పేలింది. నా కాలికి గాయమైంది. అయినా నేను కదలకుండా అలాగే నిలబడ్డాను. అప్పుడు నా కాలికి గాయమైందని తెలిసినా ఆయన నెక్స్ట్ షాట్ అంటూ వెళ్లిపోయారు. వేరే వాళ్లయితే కొడుక్కి గాయమైందని ఎంత హడావుడి చేసేవాళ్లో? మమ్మల్ని ఆయన అలా పెంచడం మంచిదే అయింది. జీవితంలో కష్టాల్ని భరించే ధైర్యం మాకందరికీ వచ్చింది’’ అని బాలయ్య చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English