విజయ్ చేతిలో ఓడాడు.. మరి అజిత్ చేతిలో?

విజయ్ చేతిలో ఓడాడు.. మరి అజిత్ చేతిలో?

‘టక్కరి దొంగ’లో నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అంటూ ఒక పాటలో ఒక లైన్ ఉంటుంది. దీనికి సూటయ్యే హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనతో ఎవరికీ పోలిక ఉండేది కాదు ఒకప్పడు. ఇప్పుడు తెలుగులో కలెక్షన్ల లెక్కలు తీస్తే ‘నాన్-బాహుబలి’ అంటూ ఎలా మాట్లాడుకుంటున్నామో.. తమిళంలో రజనీ సినిమాల్ని పక్కన పెట్టి మిగతా హీరోల సినిమాల వసూళ్లను వేరేగా లెక్క పెట్టేవాళ్లు. బడ్జెట్, మార్కెట్, పారితోషకం, వసూళ్లు.. ఇలా అన్ని విషయాల్లోనూ రజనీ లెక్కలు వేరుగా ఉండేవి. ఆయనకు మిగతా హీరోలకు అంతరం చాలా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో కథ మారుతూ వచ్చింది. వరుస ఫ్లాపులతో రజనీ మార్కెట్ పడుతూ వస్తే.. విజయ్, అజిత్ లాంటి హీరోలు బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు కొడుతూ ఆయనకు చేరువగా వచ్చారు.

ముఖ్యంగా విజయ్ అయితే రజనీని అందుకుని.. ఆయన్ని వెనక్కి నెట్టేసే స్థితికి వచ్చాడు. అతడి ‘మెర్శల్’ సినిమా సూపర్ స్టార్ సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. ‘సర్కార్’కు మంచి టాక్ వస్తే ఇది ఇంకా కొత్త రికార్డుల్ని నెలకొల్పేదే. డివైడ్ టాక్‌తో కూడా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఆ సినిమా నెలకొల్పిన రికార్డుల్ని క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘2.0’ అధిగమించలేకపోయింది. ‘సర్కార్’ తొలి రోజు.. తొలి వారాంతం వసూళ్లకు ‘2.0’ దరిదాపుల్లో కూడా లేదు. మొత్తానికి విజయ్ చేతిలో రజనీ ఓడిపోయాడన్న అభిప్రాయం కోలీవుడ్ జనాల్లో వ్యక్తమైంది. ఐతే ‘2.0’పై విడుదలకు ముందు నెగెటివిటీ ఉండటం వల్ల అలా జరిగిందని.. మంచి టైమింగ్‌లో రిలీజ్ చేయకపోవడం కూడా మైనస్ అయిందని రజనీ అభిమానులు అన్నారు.

ఐతే ఇప్పుడు సంక్రాంతికి మంచి టైమింగ్‌లోనే రిలీజవుతోంది రజనీ కొత్త సినిమా ‘పేట’. ఐతే దీనికి పోటీగా అజిత్ సినిమా ‘విశ్వాసం’ కూడా భారీ అంచనాలతో వస్తోంది. ఇప్పుడు తన సత్తా చాటడం రజనీకి ప్రతిష్టాత్మకం. అజిత్ సినిమా కంటే ‘పేట’కు ఎక్కువ ఓపెనింగ్స్.. ఓవరాల్ వసూళ్లు రాకపోతే సూపర్ స్టార్ ప్రతిష్ట దెబ్బ తింటుంది. మరి ‘పేట’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English