‘యన్.టి.ఆర్’లో ఆ సీన్ స్టాండ్ ఔట్

‘యన్.టి.ఆర్’లో ఆ సీన్ స్టాండ్ ఔట్

మొత్తానికి తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రానే వచ్చింది. సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్న నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’లో తొలి భాగమైన ‘కథానాయకుడు’ బుధవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంపై ఒక దశలో ఎంత పాజిటివిటీ కనిపించిందో.. ఆ తర్వాత అంతే నెగెటివిటీ కూడా వచ్చింది. ఐతే తొలి రోజు థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల్లో మెజారిటీ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. అందరికీ తెలిసిన.. పెద్దగా మలుపులు లేని ఎన్టీఆర్ సినీ కెరీర్‌ను అందంగా, ప్రభావవంతంగా తెరకెక్కించారని క్రిష్ అండ్ టీంను కొనియాడుతున్నారు. బాలయ్య కొన్ని గెటప్పుల్ని మినహాయిస్తే తండ్రి పాత్రలో గొప్పగానే నటించాడు. ఆయన కష్టం తెరపై కనిపించింది.

సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కానీ అన్నింట్లోకి హైలైట్ అయింది.. అందరి నోళ్లలో నానుతున్నది మాత్రం ఎన్టీఆర్ తొలిసారి కృష్ణుడి అవతారంలో కనిపించే సీనే. దీన్ని తీర్చిదిద్దిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేలా ఈ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు క్రిష్. అసలు ఈ సన్నివేశానికి రాసుకున్న లీడే చాలా బాగుంది.

శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఏంటి.. అతను సెట్టవడు అని నిర్మాత నాగిరెడ్డి దర్శకుడు కె.వి.రెడ్డితో వాగ్వాదానికి దిగడం.. మరో నిర్మాత చక్రపాణి అసహనంతో బయటికి వెళ్లిపోవడం.. సెట్లో ఒక రకమైన ప్రతికూల వాతావరణం నెలకొనడం.. సరిగ్గా అప్పుడే కృష్ణుడి గెటప్‌లో బాలయ్య వేంచేయడం.. అందరూ నోరెళ్లబెట్టి చూస్తూ ఆశ్చర్యపోవడం.. కొబ్బరికాయలు దించుతున్న పనివాళ్లు నిజంగా దేవుడిని చూసిన అనుభూతికి లోనై వాటిని బాలయ్య ముందు పగలగొట్టడం.. ఈ సీక్వెన్స్ అంతా కూడా అదిరిపోయేలా వచ్చింది. విజువల్స్ ఎంత బాగున్నాయో.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగా కుదిరింది. ఎన్టీఆర్ అభిమానులకే కాదు సామాన్య ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ ఇచ్చే సీన్ ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English