దిల్ రాజు పంచ్: ‘పేట’ను 18నే రిలీజ్ చేసుకోండి

దిల్ రాజు పంచ్: ‘పేట’ను 18నే రిలీజ్ చేసుకోండి

తాను రిలీజ్ చేస్తున్న డబ్బింగ్ మూవీ ‘పేట’కు థియేటర్లు ఇవ్వకపోవడంపై మండి పడుతూ టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ అధినేతలపై వల్లభనేని అశోక్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అల్లు అరవింద్ మనిషి అయిన పీఆర్వో కమ్ నిర్మాత ఎస్కేఎన్ స్పందించాడు. అతను కొంచెం తీవ్రంగానే మాట్లాడాడు. ఇప్పుడు స్వయంగా దిల్ రాజే.. అశోక్ వ్యాఖ్యలపై స్పందించాడు. ఆయన తన స్థాయికి తగ్గట్లు హుందాగానే మాట్లాడాడు. అశోక్ వ్యాఖ్యల్ని రాజు తప్పుబట్టాడు. తెలుగు సినిమాలకే థియేటర్లు దక్కని పరిస్థితి ఉంటే.. డబ్బింగ్ చిత్రాలకు ఎలా థియేటర్లు సర్దుబాటు చేయాలని రాజు ప్రశ్నించాడు.

సంక్రాంతికి షెడ్యూల్ అయిన మూడు తెలుగు సినిమాలు చాలా ముందుగానే రిలీజ్ డేట్లు ఖరారు చేసుకున్నాయని రాజు చెప్పాడు. ఇవి మూడూ పెద్ద సినిమాలే అని.. వాటికే థియేటర్లు సరిపోని పరిస్థితి ఉందని రాజు అన్నాడు. ఈ నెల 18 నుంచి థియేటర్లలో ‘పేట’ మాత్రమే ఉంటుందని అశోక్‌ చెబుతున్నారని.. మరి నేరుగా ఆ రోజే రిలీజ్ చేసుకోవచ్చు కదా.. ముందు ఎందుకు వస్తున్నారని రాజు సెటైర్ వేశాడు. ఊరికే ఆరోపణలు చేస్తే సరిపోదని.. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నామని రాజు అన్నాడు. గత ఏడాది పంపిణీదారుడిగా తాను చాలా డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పాడు. తెలుగు సినిమాల విడుదల తేదీ 6 నెలల ముందే ప్రకటించామని.. ఇది తెలుసుకోకుండా అశోక్‌ అనుచితంగా మాట్లాడటం సరైంది కాదని రాజు అన్నాడు. అరవింద్, రాజు లాంటి వాళ్లు థియేటర్ల విషయంలో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన అశోక్.. వాళ్లనుద్దేశించి ‘కుక్కలు’ అనే మాట అనడం.. వాళ్లను షూట్ చేయాలని విమర్శించడం దుమారం రేపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English