ప్రచారం లేకే సినిమా పోయిందట

ప్రచారం లేకే సినిమా పోయిందట

పాపం సుమంత్.. ‘మళ్ళీ రావా’తో మళ్లీ కొంచెం కోలుకున్నట్లే కనిపించాడు. కానీ ఆ తర్వాత అతను ఎంతో ఉత్సాహంగా చేసిన రెండు సినిమాలూ తీవ్ర నిరాశకు గురి చేశాయి. సుమంత్ కెరీర్లో 25వ సినిమాగా కొంచెం గట్టిగా ప్రచారం చేసి రిలీజ్ చేసిన ‘సుబ్రహ్మణ్యపురం’తో పాటు ఆ తర్వాత వచ్చిన ‘ఇదం జగత్’.. ఈ రెండూ ఫ్లాపే అయ్యాయి. ఇవి ఒకే నెలలో విడుదలై సుమంత్‌కు షాక్ మీద షాక్ ఇచ్చాయి. ‘సుబ్రహ్మణ్యపురం’ అయినా ఓ మోస్తరుగా ఆడింది కానీ.. ‘ఇదం జగత్’ అయితే వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. తాము పెట్టిన ఖర్చు వెనక్కి వచ్చింది కాబట్టి ‘సుబ్రహ్మణ్యపురం’ హిట్టే అని అప్పుడు చెప్పుకున్నాడు సుమంత్. మరి ‘ఇదం జగత్’ సంగతేంటి అంటే.. అది అన్ని రకాలుగా నిరాశనే మిగిల్చిందని అంటున్నాడు.

ఐతే ఈ సినిమా ఆడకపోవడానికి సరైన ప్రచారం లేకపోవడమే కారణమని సుమంత్ చెప్పాడు. ‘మళ్ళీ రావా’ కంటే ముందు తాను ఈ సినిమాను ఒప్పుకున్నానని.. ఐతే చిత్రీకరణ ఆలస్యం అయిందని.. రిలీజ్ ముంగిట దీన్ని సరిగా ప్రమోట్ చేయకపోవడం, సరైన టైంలో రిలీజ్ చేయకపోవడం చేటు చేసిందని సుమంత్ అన్నాడు. ఐతే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానని అతను చెప్పాడు.

ఇప్పుడు తనకు మంచి కథలు దొరికాయని.. తన నుంచి భవిష్యత్తులో వచ్చే సినిమాలు బాగుంటాయని.. త్వరలోనే తన కొత్త సినిమా రిలీజవుతుందని సుమంత్ అన్నాడు. తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటించిన ‘యన్.టి.ఆర్’ సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎన్నార్ పాత్రలో నటించడం మరుపు రాని అనుభూతి అన్న సుమంత్.. ఆయన మీద బయోపిక్ ఎప్పుడొస్తుందని అడిగితే మాత్రం అది తన మావయ్య నాగార్జున చేతిలో ఉందని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English