ఔను.. సెట్లో నేను నియంతనే-బోయపాటి

ఔను.. సెట్లో నేను నియంతనే-బోయపాటి

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన సినిమాల సెట్లో ఎలా ఉంటాడనే విషయాన్ని హీరోలు.. మిగతా నటీనటులు.. టెక్నీషియన్లు రకరకాలుగా చెబుతుంటారు. అతను ఒక హెడ్ మాస్టర్‌లాగా ప్రవర్తిస్తాడని.. తామంతా విద్యార్థుల్లా ఉంటామని జగపతిబాబు లాంటి సీనియర్ నటుడు ఒక సందర్భంలో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకా చాలామంది బోయపాటి గురించి ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. బోయపాటి సెట్లో నియంతలా ఉంటాడని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని బోయపాటి దగ్గర ప్రస్తావిస్తే ఆ మాట అక్షరాలా నిజం అన్నాడు. ఐతే అలా ఉంటేనే సినిమా అనుకున్నట్లుగా తీయగలమని.. నిర్మాత క్షేమంగా ఉంటాడని బోయపాటి చెప్పాడు. ఈ విషయమై అతను ఇంకా ఏమన్నాడంటే...


''సెట్లో నేను నియంతలా ఉంటాననే మాట నిజమే. అలానే ఉండాలి కూడా. మన చేతికి ఉన్న వేళ్లే ఒకలా ఉండవు. అలాంటిది నా యూనిట్‌లో 170 నుంచి 200 మంది ఉంటారు. అవుట్‌డోర్‌కు వెళ్తే ఇంకో 500 మంది అదనంగా కనిపిస్తారు. అంతమందిని ఎలా కంట్రోల్‌ చేయాలి? 'సార్‌. సార్‌.. ఇలా నిలబడండి సార్‌.. అలా వెళ్లండి సార్‌' అంటే పని జరుగుతుందా?

నా సినిమా షూటింగ్‌ అంటే రోజుకి 12 నుంచి 20 లక్షలు అవుతుంది. ఒకొక్క షాట్‌కీ పది నిమిషాలు ఆలస్యం అయితే.. గంటలు గంటలు వృథా అవుతాయి. ఆ డబ్బంతా ఎవరు తిన్నట్టు? నిర్మాత బాగుండాలని కోరుకునే దర్శకుడ్ని నేను. అతను బాగోకపోతే నేనెలా బాగుంటా? అందుకే సెట్లో పనులు వేగంగా జరగాలి. కాబట్టి తప్పదు.. నా సెట్లో నేను సింహంలానే ఉంటా. అలాగని నా యూనిట్‌పై ఈగ కూడా వాలనివ్వను'' అని అతనన్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా ‘వినయ విధేయ రామ’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English