బాలయ్య కాదు.. క్రిష్‌యే అడిగాడట

బాలయ్య కాదు.. క్రిష్‌యే అడిగాడట

నందమూరి తారక రామారావు జీవిత కథను సినిమాగా తెరకెక్కించడానికి ఆయన తనయుడు బాలకృష్ణ ముందుగా తేజను దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి.. షూటింగ్ కూడా మొదలుపెట్టిన కొన్ని రోజులకు అనూహ్యంగా తేజ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఒక దశలో బాలయ్యే దర్శకుడిగా మారబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి క్రిష్ దర్శకత్వంలో ‘యన్.టి.ఆర్’ పట్టాలెక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐతే బాలయ్యే క్రిష్‌ను పిలిచి ఈ ప్రాజెక్టును అప్పగించాడని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదట. క్రిష్‌యే వచ్చి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తానని అడిగాడట. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే వెల్లడించాడు.

తేజ ఏ పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి తప్పుకున్నది బాలయ్య వివరిస్తూ.. క్రిష్ సంగతి కూడా చెప్పాడు. ఇంత బరువు తాను మొయ్యలేనంటూ తేజ సతమతం అయ్యాడని.. ఆ పరిస్థితుల్లోనే అతను తప్పుకున్నాడని బాలయ్య చెప్పాడు. సినిమా విషయంలో మార్పులు జరగబోతున్నాయని.. కంగారు పడవద్దని విద్యా బాలన్‌కు చెప్పడానికి తాను ముంబయికి వెళ్లానని.. ఆ సమయంలోనే ‘మణికర్ణిక’ షూటింగ్‌లో ఉన్న క్రిష్ వచ్చి తనను కలిశాడని.. ‘బాబూ నేను డైరెక్ట్ చేయనా’ అని అడిగాడని.. అతనే దర్శకుడని అక్కడికక్కడ రెండు నిమిషాల్లో తాను నిర్ణయం తీసుకున్నానని బాలయ్య వెల్లడించాడు.

ఒక దశలో తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని అనుకున్న మాట కూడా వాస్తవమే అని.. కానీ తానైతే ఈ చిత్రానికి న్యాయం చేయలేకపోయేవాడినని బాలయ్య చెప్పాడు. క్రిష్ తెలుగు సాహిత్యం చదివిన వ్యక్తి అని.. బయోగ్రఫీల మీద కూడా బాగా అవగాహన ఉందని.. కాబట్టి అతనే ఈ సినిమాకు న్యాయం చేస్తాడనిపించిందని.. తన నమ్మకాన్ని అతను నిలబెట్టాడని బాలయ్య అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English