ఒక స్టార్ ఫాలింగ్.. ఒక స్టార్ రైజింగ్

ఒక స్టార్ ఫాలింగ్.. ఒక స్టార్ రైజింగ్

బాలీవుడ్లో సమీకరణాలు మారిపోతున్నాయి. రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను ఏలిన ఒక స్టార్ వేగంగా పతనం వైపు అడుగులేస్తుంటే.. ఆ హీరో తిరుగులేని స్థాయిలో ఉన్నపుడు అరంగేట్రం చేసిన ఒక చిన్న స్థాయి హీరో వేగంగా అగ్ర పథానికి అడుగులు వేస్తున్నాడు. ఆ ఇద్దరూ షారుఖ్ ఖాన్.. రణ్వీర్ సింగ్. ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖే నంబర్ వన్. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. షారుఖ్‌కు పోటీ ఇచ్చినా అతడిని మించలేకపోయారు. కానీ షారుఖ్ పరిస్థితి ఇప్పుడు దారుణం. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత కనీస స్థాయి హిట్ లేక అల్లాడిపోతున్నాడు కింగ్ ఖాన్. చివరగా అతను ‘జీరో’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ చిత్రం షారుఖ్ గత సినిమాల్ని మించి డిజాస్టర్ అయింది. క్రిస్మస్ వీకెండ్లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం దారుణ ఫలితాన్నందుకుంది.


ఐతే ఆ సినిమా వచ్చిన వారానికి రిలీజైన రణ్వీర్ సింగ్ సినిమా ‘సింబా’ మాత్రం బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. ఈ సినిమా మరీ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఏకంగా రూ.250 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతోందీ చిత్రం. ఇప్పటికే వసూళ్లు రూ.200 కోట్లకు దగ్గరగా ఉన్నాయి. రణ్వీర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. అతడి మార్కెట్‌ను అమాంతం పెంచేసిందీ చిత్రం. గత కొన్నేళ్లుగా రణ్వీర్ వైవిధ్యమైన సినిమాలతో నటుడిగా మంచి పేరు సంపాదిస్తూనే మార్కెట్ కూడా పెంచుకుంటున్నాడు. ‘బాజీరావు మస్తానీ’.. ‘పద్మావత్’ లాంటి సినిమాలు అతడికి ఎనలేని పేరు తెచ్చాయి. ఇప్పుడు ‘సింబా’ లాంటి మాస్ హిట్‌తో తన స్థాయిని ఇంకా పెంచుకున్నాడు. ఓవైపు షారుఖ్ పతనం అవుతున్న దశలోనే రణ్వీర్ రైజ్ కావడం విశేషం. ఇదే ఊపు కొనసాగిస్తే అతను టాప్-3లో షారుఖ్ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English