చిరు మోహన్ బాబుకు అసలు చెప్పిందేంటి?


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తాలూకు మంటలు.. ఇప్పటికీ చల్లారలేదు. ఈ మంటలు ఇంకా పెరుగుతున్నాయి కూడా. ఎన్నికలు అయిపోగానే అంతా సద్దుమణుగుతుందిలే అనుకుంటే.. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం.. ఆ తర్వాతి రోజే ఆయన ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరూ తమ పదవులకు మూకుమ్ముడిగా రాజీనామాలు సమర్పిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో మున్ముందు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో.. ఇంకెన్ని చీలికలు వస్తాయో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

900 పైచిలుకు సభ్యులున్న ‘మా’ ఎన్నికల కోసమని ఇంతకీ ఇండస్ట్రీలో కుంపట్లు అవసరమా అన్న చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలు ఇంతగా రచ్చగా మారడానికి కారణాలేంటి.. ఇంత చిన్న అసోసియేషన్‌కు అధ్యక్షుడిని ఇంతకుముందులా ఏకగ్రీవంగా ఎన్నుకోలేకపోయారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

నిజానికి ఈ ఎన్నికలు జరగడానికి కొన్ని వారాల ముందు ఏకగ్రీవం గురించి చర్చ నడిచింది. చిరంజీవి సహా ఇండస్ట్రీ పెద్దలు ఏకాభిప్రాయంతో అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నిలబెడితే తాను పోటీ నుంచి ఉపసంహరించుకుంటానని విష్ణు ప్రకటించడం తెలిసిన సంగతే. మరి తన మద్దతుతో నిలబెట్టిన ప్రకాష్ రాజ్ కోసం ఇలా ఏకాభిప్రాయం సాధించడానికి చిరు ప్రయత్నించలేదా అన్న సందేహాలు తలెత్తాయి. ప్రకాష్ రాజ్‌కు తాను మద్దతు ఇస్తున్నానని, విష్ణును ఉపసంహరించుకోమని చిరంజీవి చెప్పినట్లుగా ఓ టీవీ షోలో మోహన్ బాబు స్వయంగా వెల్లడించాడు. ఇక ఎన్నికల అనంతరం మంచు విష్ణు సైతం తనను విత్ డ్రా చేసుకోమని చిరు తన తండ్రిని కోరిన విషయం నిజమే అన్నాడు.

ఐతే చిరు కుటుంబం నుంచి ఎవరైనా నిలబడి ఉంటే తప్పుకునేవారమన్నది మోహన్ బాబు, విష్ణుల మాట. ఈ విషయమై చిరు కానీ, ఆయన క్యాంపులోని వారు కానీ ఇంత వరకు ఏమీ స్పందించలేదు. తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు బెనర్జీ.. మోహన్ బాబుతో చిరు అసలేం మాట్లాడింది వెల్లడించారు. ప్రకాష్ రాజ్ తనను కలిసి వచ్చే రెండేళ్లు ‘మా’ను ఎలా నడిపించాలో.. తన దగ్గర ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో వివరంగా చెప్పడంతో తాను ఇంప్రెస్ అయ్యానని.. ప్రకాష్ రాజ్‌ను ఏకగ్రీవ అధ్యక్షుడిగా చేయడానికి సహకరించాలని.. దానికి సరే అంటే రెండేళ్ల తర్వాత మంచు విష్ణును అధ్యక్షుడిగా తానే ప్రపోజ్ చేస్తానని చిరు మోహన్ బాబుకు చెప్పారని, కానీ ఆయనందుకు అంగీకరించలేదని బెనర్జీ వెల్లడించాడు.