బాలయ్య-తారక్ బంధంపై కళ్యాణ్ రామ్

బాలయ్య-తారక్ బంధంపై కళ్యాణ్ రామ్

తన బాబాయి నందమూరి బాలకృష్ణతో ఒకప్పుడు సన్నిహితంగానే మెలిగేవాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ గత కొన్నేళ్లలో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది. కానీ హరికృష్ణ మరణం తర్వాత ఇద్దరూ కొంచెం సన్నిహితంగా మెలగడం చూస్తున్నాం. ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌కు బాలయ్య వస్తే.. ‘యన్.టి.ఆర్’ ప్రి రిలీజ్ ఈవెంట‌్‌కు ఎన్టీఆర్ హాజరయ్యాడు. అయినప్పటికీ వీరి బంధం మీద జనాలకు రకరకాల సందేహాలున్నాయి.

ఇదే విషయం ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర విశ్లేషణ చేశాడు. ‘‘ప్రేమ అనేది మనసులో ఉంటుంది. అది ప్రదర్శించుకునే వస్తువు కాదు. నా పిల్లలకు నేను రోజూ ఐ లవ్‌ యూ చెప్పను. అలాగని మా మధ్య ప్రేమ లేనట్టా? జనం రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది వాళ్ల నైజం. వాళ్లు మాట్లాడుకునే ప్రతి విషయానికీ సమాధానం చెప్పాలా, వద్దా? అనేది మా ఇష్టం’’ అని కళ్యాణ్ రామ్ అన్నాడు.

‘యన్.టి.ఆర్’ సినిమాలో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో తారక్ ఎందుకు నటించలేదని అడిగితే కళ్యాణ్ రామ్ స్పందించాడు. ‘‘యన్.టి.ఆర్ సినిమాలో బాలకృష్ణ గారి పాత్రే లేదు. నా సినిమా కదా.. నా పాత్ర లేకుంటే ఎలా.. అని బాబాయ్‌ అనుకోలేదు. రేపు అభిమానులూ అనుకోరు. కథకి ఏం కావాలో అదే చూపించారు. మేమంతా సినిమాలో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో భాగం అయితే చాలు అనుకున్నాం. నా ఫొటో తెరపై కనిపిస్తే చాలు అనుకున్న నాకు మా నాన్నగారి పాత్ర ఇచ్చారు. ఇక తమ్ముడంటారా? సినిమా ప్రచారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం.. పాటల ఆవిష్కరణ. అందులో తారక్ పాల్గొన్నాడు. తమ్ముడికి బాబాయ్‌ ఇచ్చిన గౌరవం అది. అంతకంటే ఏం కావాలి? ఇదిగో ఈ పాత్ర చెయ్యి అంటూ ఏదో ఒకటి అప్పగించొచ్చు. ఐతే మరీ ఇంత చిన్న పాత్ర ఇస్తారా అంటూ రేప్పొద్దున అభిమానులే నిరుత్సాహపడొచ్చు. బాబాయి వరకు ఎందుకు నేనే నా తమ్ముడి దగ్గరికెళ్లి.. ‘నా సినిమాలో ఇలా వచ్చి నవ్వేసి వెళ్లిపో’ అనగలనా? తనో సూపర్‌ స్టార్‌. ఆ స్థాయికి నేను గౌరవం ఇవ్వాలి కదా’’ అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English