కథలు మనవి.. క్రెడిట్ అతడిది

 కథలు మనవి.. క్రెడిట్ అతడిది

మరో సౌత్ సినిమా బాలీవుడ్‌కు వెళ్లి బాక్సాఫీస్‌ను హీటెక్కిస్తోంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘టెంపర్’ చిత్రాన్ని హిందీలో ‘సింబా’ పేరుతో రీమేక్ చేశారు. ఐతే పూర్తిగా తెలుగు సినిమాను మక్కీకి మక్కీ దించేయకుండా.. దర్శకుడు రోహిత్ శెట్టి తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చాడు. మూల కథను తీసుకుని దాన్ని తన స్టయిల్లో ఊర మాస్‌గా నడిపించాడు.

ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైన సెన్సేషనల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్బులో చేరిన ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్బు వైపు పరుగులు పెడుతోంది. ఈ చిత్రం ఈజీగా రూ.200 కోట్ల మైలురాయిని అందుకునేలా కనిపిస్తోంది. నిజానికి ఈ చిత్ర ట్రైలర్ చూస్తే.. ‘టెంపర్’ను చెడగొట్టేశారని.. ఈ సినిమా ఆడటం కష్టమే అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అంచనాలు తప్పాయి.

రోహిత్ శెట్టికిది 8వ 100 కోట్ల సినిమా కావడం విశేషం. ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ డైరెక్టర్‌కూ ఇన్ని వంద కోట్ల సినిమాలు లేవు. అసలు బాలీవుడ్ ఏంటి.. ఇండియా మొత్తంలో ఏ దర్శకుడూ ఇన్ని వంద కోట్ల సినిమాలు ఇవ్వలేదు. నిజానికి రోహిత్ శెట్టిలో క్రియేటివిటీ అంటూ ఏమీ ఉండదు. అతను సొంత కథలతో సినిమాలు తీయడు. అసలు వేరే వాళ్లవి అయినా కొత్త కథలు తీసుకోడు. దక్షిణాదిన బాగా ఆడే సినిమాలు చూసి అందులో తనకు సెట్టయ్యే మాస్ కథలు ఎంచుకుంటాడు. వాటిని ఊర మాస్‌గా, లౌడ్‌గా తీస్తాడు. గత కొన్నేళ్లలో బాలీవుడ్లో మాస్ మసాలా సినిమాలు బాగా తగ్గిపోయాయి.

ఆ వర్గం ప్రేక్షకులకు కావాల్సిన మసాలా ఇచ్చే దర్శకులు తగ్గిపోయారు. ఐతే రోహిత్ ఆ లోటు తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. మన దగ్గర బోయపాటి లాగే మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడతను. మొత్తానికి సౌత్ కథల్ని హిందీకి పట్టుకెళ్లి వరుసగా బ్లాక్ బస్టర్లు తీస్తూ ఫుల్‌గా క్రెడిట్ తీసుకుంటున్నాడు రోహిత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English