రవిబాబు కొత్త సినిమా.. ఆవిరి

రవిబాబు కొత్త సినిమా.. ఆవిరి

దర్శకుడిగా రవిబాబు శైలే వేరు. ‘అల్లరి’ దగ్గర్నుంచి తనదైన శైలిలో వెరైటీ సినిమాలు చేస్తూ సాగిపోతున్నాడతను. కాకపోతే అతడి ప్రయోగాలు కొన్నిసార్లు అద్భుత ఫలితాలిస్తుంటాయి. కొన్నిసార్లు దారుణమైన అనుభవాలు మిగులుస్తుంటాయి. చివరగా రవిబాబు నుంచి వచ్చిన ‘అదుగో’ దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుంది. దీపావళి కానుకగా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులతో చీకొట్టించుకుంది. దర్శకుడిగా రవిబాబు కెరీర్లో ఇంతకంటే చెత్త సినిమా మరొకటి ఉండదేమో. ఐతే ఆ సినిమా ఫలితాన్ని త్వరగానే మరిచిపోయి తన కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు రవిబాబు. అతడి నుంచి రాబోతున్న తర్వాతి సినిమా ‘ఆవిరి’.

నూతన సంవత్సర కానుకగా ‘ఆవిరి’ సినిమాను అనౌన్స్ చేస్తూ.. ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశాడు రవిబాబు. ఒక గాజు సీసాలో సెక్సీగా ఉన్న అమ్మాయిని పెట్టి బాటిల్ ఓపెన్ చేస్తుంటే ఆవిరి బయట వస్తున్నట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. సీసా మూత తెరుస్తున్న చేతి గోళ్లను చూస్తే ఇది ఆత్మల నేపథ్యంలో సాగే హార్రర్ మూవీ అనే అభిప్రాయం కలుగుతోంది. పోస్టర్ మీద రవిబాబు మినహా ఎవరి పేర్లూ లేవు. అతడి నిర్మాణ సంస్థ ‘ఫ్లయింగ్ ఫ్రాగ్స్’ ప్రొడక్షన్లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతకుముందులాగా సురేష్ బాబు భాగస్వామ్యం ఏమీ తీసుకుంటున్నట్లుగా లేడు రవిబాబు. వరుసగా రెండు డిజాస్టర్ల తర్వాత మళ్లీ సొంత బేనర్లోనే సినిమా అంటే సాహసమే. కాకపోతే తక్కువ ఖర్చుతో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తాడు కాబట్టి పర్వాలేదనుకోవచ్చు. మరి రవిబాబు చేస్తున్న కొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English