బ్లాక్ బస్టర్‌తో ముగించిన బాలీవుడ్

బ్లాక్ బస్టర్‌తో ముగించిన బాలీవుడ్

ఈ ఏడాది బాలీవుడ్‌కు పెద్దగా కలిసి రాలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలు చాలానే బోల్తా కొట్టాయి. ఎన్నడూ లేని విధంగా ఆమిర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ నటించిన మూడు సినిమాలూ ఒకే ఏడాది డిజాస్టర్లుగా నిలిచాయి. పుష్కర కాలంగా ఫ్లాప్ అంటే ఎరుగని ఆమిర్ ఖాన్ సైతం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రూపంలో భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. సల్మాన్ సినిమా ‘రేస్-3’ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే షారుఖ్ ఖాన్ ‘జీరో’తో జీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఏడాది చివరి వారానికి షెడ్యూల్ అయిన ‘సింబా’పై చాలా ఆశలే పెట్టుకున్నారు బాలీవుడ్ జనాలు. ఐతే ఆ సినిమా నిరాశ పరచలేదు.

‘సింబా’ ట్రైలర్ చూసి చాలామంది మిశ్రమ స్పందన వ్యక్తం చేసిన నేపథ్యంలో సినిమా ఏమవుతుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే వాటిని పటాపంచలు చేసిందీ చిత్రం. ఈ చిత్రానికి అందరూ పాజిటివ్ రివ్యూలిచ్చారు. 3-4 మధ్య స్టార్లు ఇచ్చారు మెజారిటీ రివ్యూయర్లు. దీనికి ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. తొలి రోజు దేశవ్యాప్తంగా ‘సింబా’ రూ.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. రణ్వీర్ సింగ్ కెరీర్లో తొలి రోజు హైయెస్ట్ గ్రాసర్ ఇదే. రివ్యూలు, టాక్ బాగుండటంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ. ఇది తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించాడు. మొత్తానికి బాలీవుడ్ ఈ ఏడాదిని ఒక బ్లాక్ బస్టర్ మూవీతో ముగించి ఊరట పొందింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English