ఆ సినిమా అక్కడా డిజాస్టరే..

ఆ సినిమా అక్కడా డిజాస్టరే..

ఒక సినిమా ఆడదని కూడా తెలిసి రిలీజ్ చేయాల్సి వస్తే అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. ఆమిర్ ఖాన్ మీద అపారమైన నమ్మకంతో అతడి కొత్త సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ హక్కులు కొన్న చైనాకు చెందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ పరిస్థితి అదే. దీపావళి కానుకగా ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆమిర్ ఖాన్ కెరీర్లోనే ఇలాంటి పరాజయాన్ని చూసి ఉండడేమో. పుష్కర కాలం నుంచి ఆమిర్ కెరీర్లో ఫ్లాప్ అన్నదే లేదు. గత దశాబ్దంలో అద్భుతమైన చిత్రంలో అతను ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. మార్కెట్ పెంచుకున్నాడు. చైనాలో కూడా భారీ మార్కెట్ సంపాదించుకున్నాడు. ‘దంగల్’.. ‘సీక్రెట్ సూపర్ స్టార్’ లాంటి అతడి సినిమాలు అక్కడ భారీగా వసూళ్లు రాబట్టాయి.

దీంతో ‘థగ్స్ హిందుస్థాన్’ హక్కుల్ని భారీ మొత్తానికి సొంతం చేసుకుందో సంస్థ. ఈ వారాంతంలోనే అక్కడ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కానీ చైనా ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కేవలం పది కోట్లు మాత్రమే వచ్చాయి తొలి రోజు. ఆమిర్ గెస్ట్ రోల్ చేసిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’కు తొలి రోజే మూడు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఆ చిత్రం అక్కడ ఫుల్ రన్లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటిది తొలి రోజు దాదాపు పదివేల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తే కేవలం పది కోట్లే వచ్చాయంటే దీనిపై ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత కూడా వసూళ్లు పుంజుకునేలా లేవు. ఈ సినిమాతో నిరాశ పరిచానని స్వయంగా ఆమిర్ ఖానే ఇక్కడ ప్రకటన చేశాక అక్కడి ప్రేక్షకులు దీనిపై ఏమాత్రం నమ్మకంతో ఉంటారు. చైనాలో ‘థగ్స్’కు రిలీజ్ ఖర్చులు కూడా వచ్చేలా కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English