బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ ఫిక్స్

బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ ఫిక్స్

ఈ ఏడాది హిందీ ప్రేక్షకులు స్టన్ అయ్యేలా చేసిన సినిమాల్లో ‘అంధాదున్’ ఒకటి. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అదిరిపోయే స్పందన వచ్చింది. కేవలం హిందీ ఆడియన్స్ మాత్రమే కాదు.. మిగతా ప్రేక్షకులు సైతం సబ్ టైటిల్స్‌తో సినిమా చూసి ఆస్వాదించారు. గతంలో ‘బద్లాపూర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ తీసిన శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో కథానాయకుడు అంధుడు. హీరో బ్లైండ్ అనగానే ఇదేదో పాథటిక్ మూవీ అనుకుంటాం. ఐతే ఈ సినిమా మాత్రం చాలా ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. హిందీలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు దక్షిణాదిన రీమేక్ కాబోతోంది. తమిళ హీరో సిద్దార్థ్ ఇందులో కథానాయకుడిగా నటిస్తాడట.

గత ఏడాది ‘గృహం’ అనే హార్రర్ థ్రిల్లర్‌తో పలకరించిన సిద్ధు.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం రాశి ఖన్నాతో కలిసి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఇటీవలే ‘అంధాదున్’ చూసి దాన్ని రీమేక్ చేయాలని ఫిక్సయ్యాడట. దీనికి దర్శకుడెవరు.. నిర్మాణ సంస్థ ఏది అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సిద్ధు మాత్రం కచ్చితంగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడట. అతను తెలుగు వాళ్లకు కూడా పరిచయమే కాబట్టి ఆటోమేటిగ్గా దీన్ని రెండు భాషల్లో తెరకెక్కించే అవకాశముంది. ఐతే దీన్ని వేరుగా తెలుగులో రీమేక్ చేయడానికి వేరే నిర్మాతలు.. హీరోలు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. వాళ్లకు బేరం కుదిరితే.. సిద్ధు కేవలం తమిళం వరకే రీమేక్ చేసే అవకాశాలున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English